తెలుగుదేశం అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ తెలుగుదేశం నేతల భేటీ వూహించినట్టే ముగిసింది. పొత్తులపై తలొక విధంగా మాట్లాడకుండా తగు సమయం కోసం వేచి వుండాలని ఆయన హితబోధ చేశారన్నది సారాంశం. ఇప్పటికే టిఆర్ఎస్కు అనుకూలంగా మోత్కుపల్లి నరసింహులు, కాంగ్రెస్‌తో పొత్తుకోసం రేవంత్ రెడ్డి మాట్లాడ్డంపై సీరియస్ అయ్యారని కూడా చెబుతున్నారు. సీరియస్ కావడం అన్నది అమరావతిలోనూ హైదరాబాద్‌లోనూ కూడా టిడిపిలో ఒక తతంగంగా మారింది. ఎందుకంటే ఎన్నికల ముంగిట్లో ఎవరినీ వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.కాబట్టి ఎవరిపైనా గట్టిగా వ్యవహరించలేరు. అయితే ఏదో ఒకటి అనకపోతే నాయకత్వం పాత్రకు న్యాయం జరగదు. పైగా ప్రభుత్వం చేతిలో వుంది గనక ప్రయోజనాల రీత్యా అవతలివారు తగ్గుతుంటారు. మొత్తంపైన అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారనే మాటతో కథ ముగిసిపోతుంటుంది. ఈ సీరియన్‌ను ఆగ్రహాన్ని ఎవరి కోణంలో వారు చెబుతుంటారు. ఇప్పుడు టిటిడిపి కథ కూడా అలాగే వుంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా చిత్రిస్తారు. తమకు నచ్చినట్టే చేస్తుంటారు. చంద్రబాబు కూడా వున్న కొద్ది మందిని కాపాడుకోవడం కోసం అన్నీ దిగమింగి అస్తిత్వం కోసం తాపత్రయపడుతుంటారు. ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పరు. ఇదంతా ఒక ప్రహసనం.