గత ఐదేళ్లలో వైసీపీ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలుగా మారాయని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరుకు గండ్లు పడినా పూడ్చలేదని ఆరోపించారు. ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారని దాని ఫలితంగానే విజయవాడను వరదలు ముంచెత్తాయని వివరించారు. బుడమేరు గండ్ల పూడ్చివేతపై ఆర్మీ చేతులెత్తేసినా.. మంత్రి నిమ్మల రామానాయుడు , సాగునీటి పారుదల శాఖ అధికారులు పట్టుదలతో శ్రమించి గండ్లను పూడ్చివేశారని ప్రశంసించారు. బుడమేరు గండ్లను పూడ్చివేయడంతోనే విజయవాడకు వరద నిలిచిపోయిందని చంద్రబాబు వివరించారు.
వైసీపీ నేతలు పడవలు వదిలిపెట్టి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవలు వదిలిపెట్టింది వైసీపీకి చెందిన వారేనని..ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చింది అక్రమ ఇసుక వ్యాపారం చేసిన పడవలేనని తెలిపారు. నేరాలు చేసే వ్యక్తులు .. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది..అప్పులు మాత్రమే మిగిల్చారని వాటిని భర్తీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు లేకపోయినా నెట్టుకుంటూ వస్తున్నామని చెప్పారు. అయినా వరద బాధితులందరినీ ఆదుకుంటామని , వారంలోపు బాధితులందరికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని స్పష్టం చేశారు.