తెలుగుదేశం పార్టీలో ఏం చేసినా చేయకపోయినా సీటు గ్యారంటీ అని కొంత మంది సీనియర్లు అనుకుంటూ ఉంటారు. పార్టీతో తమది దశాబ్దాల అనుబంధమని.. తమను పక్కన పెట్టలేరని వారు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి చంద్రబాబునాయుడు ఝులక్ ఇస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఇప్పటి వరకూ కేఈ ఫ్యామిలీకే సీటు అన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల ఆయన కర్నూలు పర్యటనలో ధర్మవరం సుబ్బారెడ్డి అనే నేతకు టిక్కెట్ ప్రకటించి వచ్చేశారు. దీంతో కేఈ ఫ్యామిలీకి షాక్ తగిలినట్లయింది.
యాక్టివ్‌గా లేని సీనియర్లలో 40 శాతం పాతవారిని పక్కన పెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్టీ విధానాలను అతిక్రమిస్తున్న చాలా మంది సీనియర్లలో గుబులు రేగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన చాలామంది పదవులు పొందడంతో పాటు ఆర్థికంగా లబ్ధి చేకూర్చున్నారు. ఇలా లబ్ది పొందినవారు కూడా ప్రస్తుతం చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో జన సమీకరణ, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను సైతం భరించేందుకు కొంతమంది నిరాకరించారు. అలాంటి వారినందర్నీ లిస్ట్ నుంచి తప్పిస్తున్నారు.
వారసులకైనా.. యాక్టివ్‌గా ఉన్న వారికే చాన్సులిస్తామని.. కేవలం పేరుగొప్ప వారసులకు చాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తూ, ఆర్థికంగా లబ్ధి పొంది పార్టీ కష్టకాలంలో ఉన్న సమయాలలో కార్యకర్తల బాగోగులకు పైసా విదల్చని నాయకత్వం మాకు వద్థు అంటూ పార్టీ యువత తెగేసి చెబుతోంది. అందుకే చాలా చోట్ల కొత్త నాయకత్వం తెరపైకి వస్తోంది. యువ నేతలు చురుకుగా ప్రజల్లోకి వస్తున్నారు. టీడీపీలో మారుతున్న పరిస్థితులు సీనియర్ నాయకులకి ఇబ్బందికరంగా మారుతున్నాయి.