ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్స్ తో సమావేశం నిర్వహించారు. వ్యవసాయాన్ని సుస్థిరమైన, లాభసాటి ఆదాయ వనరుగా మార్చాలని అన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. జనవరి మొదటివారంలో ప్రారంభం కాబోతున్న జన్మభూమి కార్యక్రమంలో భాగంగా బ్యాంకర్లంతా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలన్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవాలనీ, రుణ లభ్యత విషయంలో బ్యాంకులూ రైతులకు మధ్య అంతరాలను అధ్యయనం చేయాలని సూచించారు. అంతేకాదు, జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఒకే రోజున, ఒకేసారి 2 లక్షల మందికి రుణాలు ఇచ్చే విధంగా ఓ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టూకీగా చెప్పాలంటే బ్యాంకర్స్ మీట్ సారాంశం ఇది. అయితే, గతంలో జరిగిన రొటీన్ బ్యాంకర్స్ మీట్ కంటే ఇది కాస్త ప్రత్యేకమైనదిగానే చెప్పాలి..!
ఒక్కసారి 2004 ఎన్నికల నాటి పరిస్థితిని గుర్తు చేసుకుంటే… కేంద్రంలో ఎన్డీయేగానీ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీగానీ కాస్త దూకుడుగానే ఎన్నికలకు వెళ్లాయి. క్షేత్రస్థాయిలో అన్నదాతల వాస్తవ అవసరాలను అర్థం చేసుకోలేకపోయాయి. రైతులకు అత్యంత ముఖ్యమైన రుణ లభ్యతను పట్టించుకోలేదు. దీంతో ఆ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో భాజపా, టీడీపీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దాంతో పదేళ్లపాటు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య గుజరాత్ ఎన్నికలు ఫలితాలు కూడా ఓరకంగా ప్రమాద ఘంటికలు ఓ మాదిరిగా మోగించాయనే చెప్పాలి. దేశవ్యాప్తంగా గ్రామీణ భారతంలో భాజపా పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న విశ్లేషణలూ వచ్చాయి. దీంతో భాజపా కూడా వాస్తవాలను తెలుసుకుందనే చెప్పొచ్చు. అందుకే, బ్యాంకింగ్ రంగంలో గ్రామీణ అవసరాలకు ప్రాధాన్యతను పెంచే విధంగా కొన్ని పాలసీలను మార్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో రైతుల రుణాల లభ్యతపై చంద్రబాబు సర్కారు చూపిస్తున్న అత్యధిక శ్రద్ధ వెనక కూడా ముందు చూపు ధోరణి ఉందనీ చెప్పుకోవచ్చు. నిజానికి, రాష్ట్ర స్థాయిలో ఎన్ని రకాలు నిర్ణయాలు తీసుకున్నా బ్యాంకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకుల పనితీరు మారదు. అయితే, కేంద్రం కూడా గ్రామీణ ప్రాధాన్యతను గుర్తించింది కాబట్టి, ఆ దిశగా కొన్ని దిద్దుబాటు చర్యలకు సిద్ధమౌతోంది కాబట్టి, దాన్ని అందిపుచ్చుకుంటూ 2004లో జరిగిన పొరపాటును పునరావృతం కాకుండా ఉండేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని చెప్పొచ్చు. రాజకీయాలూ ప్రయోజనాలు కాసేపు పక్కన పెడితే… ఈ కసరత్తు వల్ల రైతులకు కొంతమేర మేలు జరుగుతుందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన అంశమే.