ఆంధ్రాలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రిగానీ, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రెండు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు ఇక్కడ కళా వెంకట్రావు, అక్కడ (తెలంగాణ)లో రమణ ఉన్నారన్నారు. 8 మంత్రులు అన్ని వర్గాల నుంచీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు ఇంత ప్రాధాన్యత ఎప్పుడైనా దక్కిందా అని చెప్పారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదనీ, బీసీలకు మేలు చేస్తే టీడీపీ బలోపేతం అవుతుందని వెనకబడిన వర్గాలను అణగదొక్కిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రోజుల్లో కూడా బీసీలకు వైయస్ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. బీసీల కోసం అధికారంలో ఉన్నప్పుడు పనులు చెయ్యడం, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. వెనకబడిన వర్గాల విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు ఇస్తున్నామనీ, ఇకపై దాన్ని రూ. 15 లక్షలు ఈరోజు నుంచి ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. చేనేత కార్మికులకు ఇస్తున్న 100 యూనిట్లు కరెంటు, ఇకపై 150 యూనిట్లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
పట్టు ఒక నెలలో యార్న్ చేస్తే రూ. 1000 ఇచ్చేవాళ్లమనీ, దాన్ని రూ. 2000 పెంచుతున్నా అన్నారు. రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, సగర, కుప్పర, కృష్ణ బలిజ, వాల్మీకి, బోయ, కుమ్మరి, బట్రాజ…. ఈ ఫెడరేషన్లన్నింటినీ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నా అని హామీ ఇస్తున్నా అన్నారు. శెట్టి బలిజ, గౌడ, ఈడిగ వీరంతా ఒక కార్పొరేషన్ అడుగుతున్నారనీ, ఆ కోరిక ప్రకారమే కార్పొరేషన్ ప్రకటిస్తున్నామనీ, ఇదొక చరిత్ర అన్నారు. యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న ప్రకటించారు. యాదవులు, కుబరల దగ్గరున్న అన్ని గొర్రెలకు బీమా కల్పిస్తూ… ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని చంద్రబాబు ప్రకటించారు. మత్స్యకారులకు కూడా కార్పొరేషన్ ప్రకటించారు. చేనేత కార్మికులు, కళింగులు, తూర్పు కాపులు, గవర, గాండ్ల… వారినీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. బీసీల సబ్ ప్లాన్ కి చట్టబద్దత తీసుకొస్తామన్నారు.
తెలంగాణలో 32 కులాలకు రిజర్వేషన్లు రద్దు చేసింది కేసీఆర్ అనీ, ఆయనకి జగన్ వత్తాసు పలుకుతున్నారన్నారు. మీ ఫెడరల్ ఫ్రెంట్ పెట్టే ముందుగా… తెలంగాణలో బీసీలను ఎందుకు ఓసీలు చేశారో చెప్పాలన్నారు. బీసీలు ఎప్పుడూ టీడీపీతో ఉంటున్నారనీ, ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, బీసీల పేరుతో విమర్శలు చేసే అవకాశాన్ని ప్రతిపక్షాలకు, ఆ పార్టీలకు మద్దతు పలికేందుకు వస్తున్న పక్క రాష్ట్రాల పార్టీకీ నోరెత్తే అవకాశం లేకుండా సీఎం ప్రకటనలు చేశారని చెప్పొచ్చు.