రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదేనని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఫించన్లను పంపిణీ చేసిన చంద్రబాబు..వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించారు. అనంతరం ప్రజా వేదికపై లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు.
97శాతం ఫించన్లను మొదటి రోజే పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు చంద్రబాబు. జవాబుదారీతనం కోసమే తను స్వయంగా ఫించన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. మొదటిసారి ఫించన్ లను ఎన్టీఆర్ ప్రారంభించారు..ఆ తర్వాత తాను ఫించన్లను క్రమంగా పెంచాను. బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాం. ఇది పేదల ప్రభుత్వం.. మీకు అండగా ఉంటాం. చరిత్రలో నిలిచిపోయేలా కూటమికి విజయం అందించారు. పాలనా ఎలా ఉండకూడదో వైసీపీ చూపించింది. పాలన ఎలా చేయాలో కూటమి చేసి చూపిస్తుందన్నారు చంద్రబాబు.
గడిచిన ఐదేళ్లలో చరిత్రలో చూడని నష్టాన్ని చూశాం. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తులే దోచుకొని ఇబ్బందులకు గురి చేశారు. ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు సంపద పెంచాలి..సంపద పెంచి ప్రజలకు పంచాలి. కానీ,ఆదాయం నిల్..అప్పులు ఫుల్ చేశారని వైసీపీ పాలనను ఎండగట్టారు.
Also Read : లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి..ఏంటి ప్రత్యేకతలు !
ఒక్క సాక్షికి ప్రకటనల కోసం 432కోట్లు ఇచ్చారు..ఇదంతా ఎవడబ్బ సొమ్మని ఇచ్చారు..? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదలకు ఇల్లు లేదు కానీ 500కోట్లు ఖర్చు పెట్టి రుషికొండలో విలసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని జగన్ పై ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
మడకశిర నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. అగలి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం..అవకాశం ఉంటే మడకశిరను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. పేదరికం పోతే ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. రిజర్వాయర్ల ద్వారా తాగు, సాగునీరు సమస్యను పరిష్కారిస్తామన్నారు.
అనంతపురం, మడకశిరలో ఏపీఐఐసీ వద్ద 1600ఎకరాలు ఉంది. ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. మడకశిరలో 60కోట్లతో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా కట్టే ఇళ్ళకు నాలుగు లక్షల ఆర్థిక అందజేస్తామన్నారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు ఉండదని వివరించారు చంద్రబాబు.