చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే అధికారులకు టెన్షన్ పెరుగుతుందనేది ఎప్పట్నుంచో ఉన్న అభిప్రాయం. గత ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. గతంలో మాదిరిగా ప్రభుత్వాధికారులకు అంత ఇబ్బందులు ఉండవని కూడా భరోసా ఇచ్చారు! అయితే, సీఎం అయిన తరువాత.. పరిస్థితి ఎప్పటిలానే ఉందనేది ప్రభుత్వ అధికారులు అనుభవంలోకి వచ్చిన వాస్తవం! సమీక్ష సమావేశాలంటూ గంటల తరబడి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారనీ, చెప్పిన విషయాన్నీ మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటారనీ, తమ అభిప్రాయాలు వినేందుకు కూడా సమయం ఇవ్వరనే అభిప్రాయం నిన్నమొన్నటి వరకూ ఉద్యోగ వర్గాల్లో బలంగా వినిపించేది! ఇప్పుడీ చర్చ మరో టర్న్ తీసుకుంది.
ముఖ్యమంత్రి నిర్వహించే సుదీర్ఘ సమావేశాలపై మొదట్లో అధికారులకు కాస్త విసుగ్గా అనిపించినా… సర్దుకుపోయేవారు. ఇప్పుడు, సీఎం మీటింగుల్ని లైట్ గా తీసుకునే స్థాయికి వచ్చేశారు! అంతేకాదు, ఏకంగా జోకులు వేసుకుంటున్నారట! గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డిగానీ, అంతకుముందు ఎన్టీఆర్ గానీ ఏ సభలు నిర్వహించినా సమీక్షలు చేసినా అనుకున్న సమయంలోనే ముగించేవారనీ… కానీ, చంద్రబాబు మాత్రం అలా చేయడం లేదని మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు, చంద్రబాబుకు ఎందుకు టైమ్ తెలియడం లేదన్న విషయంపై కూడా జోకులు వేసుకుంటున్నారట. ఉన్నతాధికారుల సర్కిల్స్ లో ఈ చర్చ చక్కర్లు కొడుతోందని సమాచారం. ఇంతకీ ఆ జోకు ఏంటంటే.. చంద్రబాబు పేదవాడినని గతంలో చెప్పుకున్నారనీ, కనీసం వాచీ కూడా పెట్టుకోవడం లేదని చెప్పారనీ.. అందుకే, ఆయన సమయం చూసుకోవడం లేదని జోకులు వేసుకుంటున్నారట. ఆయన చేతికి వాచీ లేకవడం వల్లనే మీటింగులు సుదీర్ఘంగా సాగుతున్నాయనీ, అందరం కలిసి ఒక వాచీ కొనుగోలు చేసి, ఆయనకి బహుమతిగా ఇస్తే బాగుంటుందని కూడా జోకులు పేల్తున్నాయట.
ఒక ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలపై ఇలాంటి అభిప్రాయం అధికారుల్లో రావడం కరెక్ట్ కాదు కదా! సీఎం సమావేశాల్ని లైట్ గా తీసుకోవడం మొదలైతే… అధికారుల్లో నిబద్ధత కూడా తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో కీలకమైన అంశాలపై కూడా అధికారుల ఫోకస్ ఇలానే లైట్ గా మారే ప్రమాదం ఉంది కదా! మరి, ప్రతీ చిన్న విషయంలోనూ ఎంతో విజన్ తో నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు నాయుడు… తన సుదీర్ఘ మీటింగుల ప్రభావం ఇలా ఉంటుందని విశ్లేషించుకోవడం లేదా అనే అనుమానం కలుగుతోంది. ఏదేమైనా, అధికారుల్లో ఈ తరహా అభిప్రాయాలూ జోకులూ కామెడీలకు ఆస్కారం ఇచ్చేలా ముఖ్యమంత్రి తీరు ఉండకూడదు