ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా పండుగను కూడా తుపాను బాధితుల మధ్యనే జరుపుకోవాలని నిర్ణయించారు. సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం వాసులుకు మనోధైర్యం కల్పించి, బాసటగా నిలిచేందుకు తుపాను భాదిత ప్రాంతాలలోనే ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నిర్ణయంతో కేబినెట్ మంత్రులు కూడా.. ఉద్దానం చేరుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా.. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో బస చేసింది. కేబినెట్ మంత్రులందరూ అక్కడే ఉన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని ఇన్ ఛార్జ్ గా నియమించారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఒక్కో గ్రామానికి ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. విద్యుత్ సరఫరాను మెజారిటీ గ్రామాలకు పునరుద్ధరించగలిగారు. ఇంకా కొన్ని గ్రామాలకు కరెంట్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.
తాగునీరు, భోజనం, నిత్యవసర వస్తువుల సరఫరా, విద్యుత్ సరఫరా పునరుద్దరణపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద వహించారు. తాగునీరు, భోజనం, నిర్యవసరాల వస్తువుల సరఫరాను క్రమబద్దీకరించారు. 25వేల విద్యుత్ స్తంభాలు అవసరమయ్యాయి. వీటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు.కోస్తా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ సిబ్బందిని శ్రీకాకుళంకు తరలించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వారం రోజుల నుంచి అక్కడే బస చేశారు. ఆయన ఇన్ ఛార్జ్ గా ఉన్న మండలాల్లో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
తితిలీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని మండలాలలో పరిస్థితి హృదయ విదారకంగా ఉండటంతో పండుగ వేళ కుటుంబానికి దూరంగా ఉన్నా పర్వాలేదని, ప్రజలు బాగుండటమే తనకు పండుగని చంద్రబాబు భావించారు. ముఖ్యమంత్రి పండుగ రోజు కూడా శ్రీకాకుళంలోనే ఉండాలని నిర్ణయించడంతో మంత్రులు, అధికారులందరికీ గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. పండుగ పూట ఇంటికి వెళదామని భావించిన అధికారులు, మంత్రులు సిక్కోలులోనే ఉండిపోవాల్సి వచ్చింది.