ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించేవారిలో విశాఖపట్నం శారదాపీఠాధిపతి స్వామీ స్వరూపానంద ఒకరు. చంద్రబాబు సర్కారుపై ఆయనలో వ్యతిరేకత అంతగా పెంచిన కారణమేంటో తెలీదుగానీ.. కొద్దిరోజుల క్రితం విజయవాడలోని కృష్ణానదీ తీరంలో జరిగిన బ్రాహ్మణ గర్జన కార్యక్రమంలో స్వామీజీ తీవ్ర విమర్శలే చేశారు. ప్రభుత్వ తీరుపై కాస్త తీవ్రంగానే మండిపడ్డారు. చంద్రబాబుపై విమర్శల స్వరం పెంచుతున్న స్వరూపానందపై ఏపీ సర్కారు నిఘా వేసిందని తెలుస్తోంది.
స్వామీజీ ఎక్కడికి వెళ్లినా నిఘా వర్గాలు కూడా ఆయన్ని అనుసరిస్తున్నాయట! ఏపీ పోలీస్ నిఘా విభాగం అధికారులు ఆయన కదలికలపై రెండు కళ్లూ వేసి ఉంచాయని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి స్వామీజికి వెళ్లినా స్వామిపై నిఘా నేత్రం ఉంటోంది. అంతేకాదు, ఆ మధ్య చాతుర్మాస దీక్ష సందర్భంగా రిషీకేష్కి స్వామీజీ కొన్నాళ్లు వెళ్లారు. ఏపీ నుంచి ప్రత్యేకంగా అక్కడినీ నిఘా వర్గాలకు చెందిన అధికారులను పంపించి మరీ స్వామీజీ కదలికలపై చంద్రబాబు సర్కారు నివేదికలు తెప్పించుకుందని సమాచారం.
తాజాగా విశాఖ శారదాపీఠం బాధ్యతల్ని తన సహాయకుడు కిరణ్ కుమార్ శర్మకు అప్పగించాలని స్వామీజీ నిర్ణయించుకోవడం విశేషం. శేష జీవితాన్ని రిషీకేష్కి వెళ్లి గడపాలన్న ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు స్వామీజీ చెబుతున్నారు. అయితే, స్వామీజీ నిర్ణయం వెనక ఇంకేవైనా శక్తులు పనిచేసి ఉంటాయేమో అనే అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బలంగా వినిపిస్తున్న మరో మాట ఏంటంటే… చంద్రబాబు నివాసానికి స్వామీజీ సమీపంలో ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటూ ఓ మంత్రి స్వయంగా ఆఫ్ ద రికార్డ్‌లో వ్యాఖ్యానించినట్టు చెప్పుకుంటున్నారు. ఆ మంత్రి స్వామీజీకి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం! మొత్తానికి, ఒక స్వామీజీపై చంద్రబాబు సర్కారు ఇలా నిఘా పెట్టించిందనేది మాత్రం విశేషమే!