జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల నాటికి మరోసారి కీలక రాజకీయ శక్తిగా అవతరిస్తారనడంలో సందేహం లేదు. ప్రతిపక్ష వైకాపాను అడ్డుకునేందుకు మరోసారి పవన్ కల్యాణ్ క్రేజ్ ఉపయోగపడుతుందన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అర్థం కాని విషయమైతే కాదు. అలాగని, టీడీపీతో జనసేన జత కట్టే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే, పవన్ ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధమని క్లారిటీ ఇచ్చేశారు. అయితే, పవన్ సేవల్ని మరోలా ఉపయోగించుకునేందుకు కావాల్సిన వ్యూహరచన జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా ఇలాంటి వ్యూహాత్మక శక్తులే పవన్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీకి వంతపాడే మీడియా వర్గమేదో అందరికీ తెలిసిందే. అయితే, ఈ మీడియా పవన్ విషయంలో ఒక క్లియర్ స్టాండ్ తీసుకుందని అనిపిస్తోంది. ఇన్నాళ్లూ పవన్ విషయంలో ఆ మీడియా వర్గానికి గోడమీది పిల్లివాటంగానే ఉంటూ వస్తున్నారు. కారణమేంటంటే… గత ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి పవన్ కల్యాణ్ చేయూత మరచిపోలేనిది కదా! అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఇప్పటి నుంచే సదరు మీడియా వర్గం ఓ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఏపీలో టీడీపీ వ్యతిరేకత కొంత మొదలైందన్నది వాస్తవం. ఆ విషయం టీడీపీకి కొమ్ముకాసే మీడియాకీ అర్థమౌతూనే ఉంటుంది. అయితే, ఆ వ్యతిరేకత ప్రతిపక్షనేత జగన్‌కు ప్లస్ కాకుండా, అది పవన్ వైపు మళ్లించే ప్రయత్నం ఆ మీడియా వర్గం మొదలుపెట్టిందనే చెప్పాలి. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు ఐదు పేజీల కవర్ స్టోరీతో ఒక ప్రముఖ మీడియా ఆదివారం అనుబంధం నింపేసింది! ఇదంతా వ్యూహాత్మకమే అనిపిస్తోంది.
ఇంకోపక్క.. ఏపీలో కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గుతుందనేది కూడా కీలకమే కదా! వీరిలో టీడీపీ వ్యతిరేక ఓటు.. జగన్‌కు అనుకూలంగా మారకుండా చూడాలి. అలాగే, దీంతోపాటు చంద్రబాబును వ్యతిరేకిస్తున్న ఇతర వర్గాలను కూడా జగన్‌వైపు తిరక్కుండా అడ్డుకోవాలి! సో… ఇలాంటి లక్ష్యాలతోనే సదరు వర్గం ఇప్పుడు పవన్‌వైపు చేరుతోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే… ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రీప్లానింగ్ ప్రకారం జరుగుతున్నదనే వారూ లేకపోలేదు. మొత్తానికి జనసేనకు ప్రాధాన్యత పెంచడం వెనక వీరి ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏ వ్యూహమూ లేనిదే సదరు మీడియా పెద్దలు చంద్రబాబుకు తప్ప, ఇతరులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వరనేది ఓపెన్ సీక్రెట్. అందుకు పవన్ కల్యాణ్ కూడా అతీతం కాకపోవచ్చు కదా!