రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలలో నెలకొన్న అభద్రతా భావం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే సుమారు 13 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఆ తరువాత జరిగిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో అక్కడ తనకే భద్రతలేదని గ్రహించి విజయవాడకు మకాం మార్చేసారు. ఆ తరువాత ఆయన దేశావిదేశాలు అన్నీ తిరిగి వస్తున్నారు కానీ హైదరాబాద్ కి మాత్రం వెళ్ళడం లేదు. సుమారు మూడు నెలలు తరువాత మళ్ళీ నేడు ఆయన హైదరాబాద్ వెళుతున్నారు. కనుక ఇది కూడా ప్రత్యేకంగా పేర్కొనవలసిన వార్త అయింది. ఇకపై వారానికి రెండు రోజులు హైదరాబాద్ నుంచి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు.
జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.ఎం.సి.) ఎన్నికలు జరుగబోతునందున వాటి కోసం పార్టీని సిద్దం చేసేందుకు ఆయన మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లి రావాలనుకొంటున్నారు. వచ్చే నెలలో జంట నగరాలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారని కుతుబుల్లా పూర్ తెదేపా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలలో తెదేపా-బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నాయి కనుక ఆయన బీజేపీ నేతలతో కూడా సమావేశమవుతారు. కేసీఆర్ తో కొత్తగా కుదిరిన దోస్తీ భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఆయన వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో ఆయన స్వయంగా రెండు పార్టీలను నడిపించడానికి సిద్దపడుతున్నారు. మరి దాని వలన వారి దోస్తీ మళ్ళీ కటీఫ్ అయినట్లయితే పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయేమో? చూడాలి.