తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో మళ్లీ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. గత ఎన్నికలకు ముందు ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి .. ఢిల్లీ రాజకీయాల్లో వేలు పెట్టి ..మోడీని ఢీకొట్టారు. కానీ ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో అసలు రాజకీయ ఉనికికే ముప్పు వచ్చి పడింది. ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మోడీ కన్నా సీనియర్ అయినా . .. రాజకీయంలో మోడీకి సరి జోడు కాదని చంద్రబాబు తెలుసుకున్నారు. అందుకే మళ్లీ దగ్గరవ్వాలనుకుంటున్నారు. అందులో సందేహం లేదు.
అయితే బీజేపీతో పొత్తు ద్వారా చంద్రబాబు సాధించేదేంటి? అంటే ఎవరూ చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడాలేదు. వారు కూడా సామాజికవర్గ పరంగా … చంద్రబాబుపై ద్వేషంతో ఉండేవాళ్లు ఎక్కువ. పాజిటివ్‌గా ఉండేవారు తక్కువ. పొత్తులు పెట్టుకున్నా వారి ఓట్లు కలసి వస్తాయన్న నమ్మకం లేదు. మరి బీజేపీతో పొత్తుతో సాధించేదేంటి ? . కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీగా.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెప్పవచ్చు. కానీ రాష్ట్రానికి ఎంత మేర ప్రయోజనం ఇస్తున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. నిజానికి టీడీపీ ఎన్డీఏలో ఉన్న నాలుగేళ్లలో విభజన చట్టంలో చాలా హామీలు నేరవేర్చారు. గత మూడేళ్ల నుంచి అదీ లేదు.
ఇప్పుడు మళ్లీ బీజేపీ సహకారం కోసం బీజేపీతో వెళ్తాం అంటే.. నమ్మేలా ఉంటుందా అన్నది కీలకం. అయితే జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే మాత్రం ఓ పాజిటివ్ వేవ్ వస్తుంది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అండ .. అదీ అత్యంత బలమైన ప్రభుత్వం అండ ఉంటే… ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండదు. ” ఎక్స్‌టర్నర్ అఫైర్స్” అండగా మారుతాయి. ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పొత్తులు దాకా వెళ్తారా లేకపోతే బయట నుంచి మద్దతుతోనే ఎన్నికలకు వెళ్తారా అన్నది ముందు ముందు రాజకీయ పరిణామాల్ని బట్టి అంచనా వేసుకోవచ్చు.