రైతు రుణమాఫీ నాలుగు, ఐదు కిస్తీలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని.. టీడీపీ వాదిస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన శాసనసభాపక్షంలో.. ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరుపై చర్చ జరిగింది. రుణమాఫీ నాలుగు, ఐదు కిస్తీలు చెల్లించటం ప్రభుత్వ బాధ్యత అని, 10 శాతం వడ్డీతో సహా రైతులకిచ్చిన బాండ్లను గౌరవించాలని టీడీపీ ఎల్పీ డిమాండ్ చేసింది. భవిష్యత్తు ఉందంటేనే ఎవరైన రాష్ట్రానికి వస్తారని, పెట్టుబడులు పెడతారని, అభద్రతను పెంచితే భవిష్యత్తును దెబ్బతీస్తే ఏమీరావని వ్యాఖ్యానించారు. అవగాహన లేకుండాపోవడం, చెప్పుడు మాటలు వినటం, టీడీపీపై బురదచల్లటమే వైసీపీ త్రిసూత్రంగా పెట్టుకుందని, పోలవరం, రాజధాని అమరావతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరువల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, శాసనసభ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియచేయాలని టీడీపీఎల్పీ నిర్ణయించింది.
శాసనసభకు ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు ఐదేళ్లపాటు పట్టుదలగా పనిచేయాలని చంద్రబాబు కోరారు. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. శాసనసభ సమావేశాల తొలిరోజు అందరూ పసుపు చొక్కాలతో అసెంబ్లీకి హాజరుకావాలని ఉదయం 9.30 గంటలకల్లా ఉండవల్లిలోని అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అక్కడ్నుంచి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవాలని నిర్ణయించారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పారు. తనకంటే శాసనసభ్యుల గళమే అసెంబ్లీలో ఎక్కువగా వినిపించాలని పార్టీ, ప్రజలపట్ల బాధ్యతను కూడా తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచాలని, సమస్యల పరిష్కారంపై పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. 15 రోజులుగా అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు దిగటంపట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ తరపున ఏం చేయాలనే అంశంపై కార్యాచరణను రూపొందిద్దామని స్పష్టం చేశారు.