హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యూటర్న్లకు పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంకూడా తెలంగాణ బాటలో నడుస్తున్నట్లుంది. మద్యం విధానం విషయంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుంది. మద్యం వ్యాపారంనుంచి వైదొలగాలని నిర్ణయించింది. 13 జిల్లాలలో ఎక్సైజ్ శాఖ నడుపుతున్న 427 మద్యం దుకాణాలను ముసేయాలని తీర్మానించింది.
పొరుగు రాష్ట్రం తమిళనాడు తరహాలో మద్యం వ్యాపారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలని, వైన్ షాపులను తామే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం నిర్ణయించింది. అయితే తర్వాత ఏమనుకుందో ఏమోగానీ, జులైలో ఎక్సైజ్ విధానాన్ని రూపొందించే సమయానికి కేవలం 10 శాతం దుకాణాలనే ఎక్సైజ్ శాఖకు వదిలింది. ఇప్పుడు ఆ 10 శాతం దుకాణాలనుకూడా ప్రైవేట్ వ్యాపారులకు వదిలేయాలని నిర్ణయించింది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో తీవ్రమైన సిబ్బంది కొరతను దీనికి కారణంగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రైవేట్ లిక్కర్ లాబీ ఒత్తిడివలనే ప్రభుత్వం తన మనసు మార్చుకుందని సమాచారం. ప్రభుత్వం నడిపే దుకాణాలు మంచి క్వాలిటీ, క్వాంటిటీ మద్యాన్ని అమ్ముతుండటంతో స్వల్పకాలంలోనే బాగా ప్రజాదరణ పొందాయని, ఆ పరిణామాన్ని భరించలేని ప్రైవేట్ వ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతుంటారని, క్వాలిటీకూడా ఉండదన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ దుకాణాలలో మంచి మద్యం అందిస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులుకూడా అదే క్వాలిటీ మద్యాన్ని అమ్మాల్సి వస్తోంది.
తమిళనాడు తరహాలో వైన్ షాపులను నడపాలని నిర్ణయం తీసుకుంది సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వమే మనసు మార్చుకోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది కొరతే కారణమని, కొత్త నియామకాలకేమో ప్రభుత్వ ఆమోదం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 427 వైన్ షాపులను నవంబర్ నెలాఖరులోపు వేలంద్వారా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.