హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్సీ వై.రాజేంద్ర ప్రసాద్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019లో దేశ ప్రధాని అవుతారని, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని జోస్యం చెప్పారు. వారు ఆ పదవులను అలంకరించబోతున్నారని తాను గర్వంగా చెబుతున్నానని, కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నానని, దీనిని నోట్ చేసుకోవాలని విలేకరులకు సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు తెలుగుజాతికి లివింగ్ లెజెండ్స్ అని అన్నారు. ఏపీని లోకేష్ చూసుకుంటారని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. వెంకయ్యనాయుడు ఏపీనుంచి రాజ్యసభకు పోటీచేస్తారని మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతుండగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఏమిటని అన్నారు. విజయవాడలో కల్తీమద్యం దుర్ఘటనపై స్పందిస్తూ, గత పదేళ్ళలో కాంగ్రెస్ పాలనలో, వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాధికారులు విశృంఖలత్వానికి అలవాటు పడిపోయారని వ్యాఖ్యానించారు. లంచాలకు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయటానికి, డబ్బులిస్తే ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారని, కృష్ణాజిల్లాలో ఇది బాగా ఉందని చెప్పారు. మద్యనిషేధం అసాధ్యమని అన్నారు. జగన్ ఇవాళ కల్తీ మద్యం బాధితులను పరామర్శించటంపై స్పందిస్తూ, జగన్ మంచి పనులకు, శుభకార్యాలకు హాజరవడు కానీ ఎవరైనా చనిపోతారేమోనని మాత్రం గోతికాడ నక్కలాగా, రాబందులాగా ఎదురు చూస్తుంటాడని ఎద్దేవా చేశారు. విభజన చట్టాన్ని ఎన్డీఏ అమలు చేయటంలేదనటం సరికాదని అన్నారు.
మొత్తం మీద రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు, వెంకయ్యలపై చేసిన వ్యాఖ్యలు ఓవర్‌గా అనిపిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్‌కు టీడీపీలో అతివాద నాయకుడిగా పేరుంది. టీవీ ఛానల్స్‌లో జరిగే పేనల్ డిస్కషన్స్‌లో ప్రత్యర్థి పార్టీల నేతలను తిడుతుంటారు… తిట్లు తిట్టించుకుంటుంటారు. నటి, వైసీపీ నాయకురాలు రోజా అయితే ఒకసారి టీవీ9 ఛానల్లో జరిగిన డిస్కషన్లో రాజేంద్రప్రసాద్‌ను చెప్పు తీసుకుని కొడతానంటూ లేచింది.