ఎవరైనా ఓటమిపై విశ్లేషణ చేసుకుంటారు. కానీ.. ఇప్పుడు విశ్లేషణ కూడా చేసుకోవడానికి అవకాశం లేనంతటి ఘోర పరాజయం తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. దీనికి కర్త, కర్మ, క్రియ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆయన పార్టీని పూర్తిగా తన అదుపాజ్ఞల్లోనే నడిపారు. ప్రతీ చిన్న విషయాన్ని తనే లీడ్ చేశారు. ఫలితంగా ఘోర పరాజయం ఎదురైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత …. పాలనపైనే.. టీడీపీ అధినేత దృష్టి పెట్టారు. దాంతో పార్టీలోని పరిస్థితులు కంట్రోల్ తప్పాయి. పదేళ్ల తర్వాత అధికారం వచ్చిందన్న ఉత్సాహంలో.. ప్రజల కన్నా… తామే ఉన్నతం అన్నట్లుగా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు.. సర్వేల ద్వారా చంద్రబాబుకు చేరుతున్నా.. కట్టడి చేసే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. దాంతో అసలుకే మోసం వచ్చింది. దీనికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంది. పార్టీ నేతలను కంట్రోల్ చేయకపోవడంతో.. క్షేత్ర స్థాయిలో అసంతృప్తి పెరిగిపోయింది.
ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పుడు.. ఒక ఏడాది ముందు మాత్రమే.. టీడీపీ అధినేత పార్టీపై దృష్టి పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత కూడా కవర్ చేసుకోలేదు. అంతే మొండిగా ఎన్నికలకు వెళ్లారు. ధర్మపోరాట సభలకు ఇచ్చిన ప్రయారిటీ… పార్టీకి ఇవ్వలేదు. అది పరిస్థితుల్ని మరింత దిగజార్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత.. ఎంతగా.. పార్టీపై అదుపు కోల్పోయారంటే.. చివరికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేసుకోలేకపోయారు. ఈ విషయం పోలింగ్ రోజు స్పష్టమయింది. టీడీపీ హైకమాండ్ కూడా అదే నివేదికలు వచ్చాయి. పోల్ మేనేజ్ మెంట్లో… కింగ్ అని చెప్పుకునే చంద్రబాబు కూడా… ఈ పరిస్థితి ఊహించి ఉండరు. ఆ స్థాయిలో టీడీపీ యంత్రాంగం ఫెయిలయింది.
చంద్రబాబు అంతా తానే చేయాలనుకోవడం… బాధ్యతలను వికేంద్రీకరించకపోవడంతో.. అసలుకే మోసం వచ్చింది. అందుకే ఓటమి బాధ్యత కూడా ఆయనే భరించాల్సి ఉంటుంది. ఈ ఓటమి సాదాసీదాది కాదు. పార్టీ పునాదుల్ని కదిలించేదే.. ఈ విషయంలో.. ఆయన వేయబోయే అడుగులే కీలకం కాబోతున్నాయి.