నేటి నుంచి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆయుత చండీయాగం ఆరంభం అయింది. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానించారు. ఈనెల 27వ తేదీన హాజరవుతానని ఆయన మాట ఇచ్చేరు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చండీయాగానికి హాజరయి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భుజాలు రాసుకొని తిరుగుతుంటే, తాము ఏవిధంగా కేసీఆర్ ని, తెరాసను ఎదుర్కోగలమని తెలంగాణా తెదేపా నేతలు వాపోతున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు, తమ రాజకీయ ప్రత్యర్ధి కేసీఆర్ తో కలిసి తిరిగితే తెరాస నేతలు, వారి మీడియా వారిద్దరి ఫోటోలను, వీడియోలను చూపించి హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రజల ఓట్లను కూడా కొల్లగొట్టుకు పోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను, నేతలను, కార్యకర్తలను నయానో, భయాన్నో కేసీఆర్ లొంగదీసుకొని తెరాసలోకి తీసుకుపోతున్న సంగతి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు చండీయాగానికి వెళ్ళడం సరికాదని తెలంగాణా తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. తాము విమర్శిస్తున్న వ్యక్తితోనే తమ అధినేత చేతులు కలిపి తిరుగుతుంటే, ఇక ప్రజలు మాత్రం తమ మాటలను, పోరాటాలను ఎందుకు విశ్వసిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు ఈయాగానికి వెళ్ళడం మానుకోవాలని వారు ఆయనని కోరినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు యాగానికి వెళ్లేందుకే నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఎక్కువసేపు ఉండకుండా కేసీఆర్ ని పలకరించి వెంటనే తిరిగి వచ్చేయాలనుకొంటున్నట్లు సమాచారం. అక్కడ అందరూ తెరాస నేతలే ఆయనకీ ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది తన పార్టీకే చెందినవారే ఉంటారు కనుక వారిని పలకరించడం చంద్రబాబు నాయుడుకి కూడా ఇబ్బందే.