తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. ప్రతీ సారి అభ్యర్థుల ఎంపికలో ఆయన పాటించే విధానం సాగతీతగా ఉంటుంది. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో ఆయనకు క్లారిటీ ఉంటుంది. కానీ.. ఇతర నేతల్ని బుజ్జగించడానికి చాలా సమయం తీసుకుంటారు. చివరికి నామినేషన్ల ప్రక్రియ ముగిసే తేదీ నాటికి కూడా.. కొన్ని సీట్ల పంచాయతీల్ని ఆయన తేల్చుకోలేకపోయేవారు. చివరికి నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చేటప్పటికి బీఫాం ఇచ్చే పరిస్థితులు ఉండేవి. కానీ మారిన రాజకీయాల్లో ఆయన మొహమాటాలు పెట్టుకోవడం లేదు. టిక్కెట్ లేని వాళ్లకి నేరుగా టిక్కెట్ లేదని చెప్పేస్తున్నారట. పార్టీలో ఉంటే.. తాను రాజకీయ జీవితానికి ఎలా అండగా ఉంటానో చెబుతూ… ఆ తర్వాత మీ ఇష్టం అని తేల్చి చెప్పేస్తున్నారట.
నాలుగు సంస్థల నుంచి సర్వే నివేదికలు, పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, ఆర్టీజీఎస్ నుంచే సేకరిస్తున్న ప్రజాభిప్రాయం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. టిక్కెట్ ఇవ్వడం లేదని.. చెప్పే వాళ్లకు చెప్పేస్తున్నారు. వారికి.. కూడా.. వారి మైనస్ పాయింట్లు.. వారి నియోజకవర్గంలో.. ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు చేశారో చెబుతూ… ఓ నివేదిక ఇస్తున్నారు. పక్కా సమాచారంతో.. సర్వే నివేదికలు, మైనస్ పాయింట్లు ఉండటంతో.. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి రోజుకు పదిహేను మందితో సమావేశమవుతున్నారు. 70 మంది అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేశారు. టిక్కెట్లు లేవని.. కనీసం 20 మందికి చెప్పారని.. వారిలో కొంత మంది రియలైజ్ అయ్యారని అంటున్నారు. టిక్కెట్ ఇవ్వబోతున్న ఎమ్మెల్యేలకు మరింత కష్టపడాలని చెప్పి పంపిస్తున్నారు. మెజార్టీ పెరిగితే.. ఏపీ అభ్యర్థులకు ఉపయోగపడుతుందని… చెబుతున్నారు.
ఎలా చూసినా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చడం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారుతోంది. కనిగిరి నుంచి ఎమ్మెల్యే బాబూరావును తొలగించి.. ఆయన స్థానంలో… ఉగ్రనరసింహారెడ్డి అనే కాంగ్రెస్ నేతకు సీటివ్వాలని.. చంద్రబాబు నిర్ణయించారు. కానీ బాబూరావు .. బాలకృష్ణ బాల్యమిత్రుడు. బాలకృష్ణ సిఫార్సుతోనే ఆయన రెండు సార్లు టిక్కెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు తనకే టిక్కెట్ కావాలంటున్నారు. మరి ఆయనను తొలగించి.. ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తే బాలకృష్ణ ఎలా రియాక్టవుతారనే సందేహం సహజంగానే వస్తుంది. ఇలాంటి వాటిని కవర్ చేయడానికి చంద్రబాబు తంటాలు పడాల్సి వస్తోంది. చివరి ధర్మపోరాట దీక్షలోనే.. వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే.. కసరత్తు మరింత వేగవంతం చేశారంటున్నారు.