త్వరలో తెలంగాణలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి టీడీపీ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కూటమి పార్టీల మధ్య తరచూ సమావేశాలూ సంప్రదింపులూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీట్ల సర్దుబాటు విషయంలో పట్టుదలకు వెళ్లొద్దనీ, కాస్త పట్టువిడుపు ధోరణితోనే సర్దుకుపోవాలంటూ టి. టీడీపీ నేతలకు సూచించారు. సీట్ల కేటాయింపు అంశమై తానే స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడతానని అన్నారు.
మహాకూటమిలో బాగంగా 12 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందనీ, మరో 6 సీట్లు ఇమ్మంటూ కోరదామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో మహా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందనీ, ఆ మేరకు తెలుగుదేశం శ్రేణులన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టిక్కెట్లు ఆశిస్తున్నవారందరికీ దక్కకపోవచ్చనీ, అంత మాత్రాన ఎవ్వరూ నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు. ఎన్నికల తరువాత ఇతర పదవుల కేటాయింపుల్లో అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఇక, ఎన్నికల ప్రచారం విషయానికొస్తే… త్వరలోనే ఆయన రాష్ట్రానికి వస్తారని టీ టీడీపీ నేతలు అంటున్నారు. ప్రచారానికి రమ్మని తాము కోరామనీ, ఆయన సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. తెలంగాణలో చంద్రబాబుతో నాలుగు భారీ సభలు నిర్వహించాలనే ఆలోచనలో టీ టీడీపీ ఉన్నట్టు సమాచారం. ఇక, ఇదే సందర్భంలో తెలంగాణలో పొత్తు విషయమై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. తెలంగాణలో ఏర్పడుతున్న మహా కూటమి జాతీయ స్థాయి రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందన్నారు.
ఒకటైతే వాస్తవం… తెలంగాణలో మహా కూటమి అధికారంలోకి వస్తే, దాని ప్రభావం జాతీయ స్థాయిలో కచ్చితంగా ఉంటుంది. లోక్ సభ ఎన్నికలు వచ్చేనాటికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటుకు మరింత ప్రోత్సాహం లభించినట్టు అవుతుంది. దీంతోపాటు, లోక్ సభ ఎన్నికల్లో కూడా టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగే అవకాశాలున్నట్టుగా చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా ఈ వ్యాఖ్యల్ని భావించొచ్చు.