ఆంధ్రప్రదేశ్ భాజపా నేతలకు ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉంటుంది! అదేంటంటే.. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని పథకాల ఘనత భాజపాకి దక్కడం లేదనీ! దానికంటే వారిని మరింత బాధ పెడుతున్న అంశం ఏంటంటే… కేంద్ర పథకాల అమలును కూడా చంద్రబాబు తన సొంత ఘనతగా ప్రచారం చేసుకుంటూ ఉండటం! ఈ మధ్య ‘స్వచ్ఛతే సేవ’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రం. అయితే, ఈ ప్రచారంలో భాజపాకి ప్రాధాన్యత దక్కడం లేదనీ, బ్యానర్లూ వాల్ పోస్టర్లపై ప్రధాని ఫొటో కూడా పెట్టలేదంటూ ఏపీ భాజపా నేతలు చంద్రబాబుపై ఈ మధ్య అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక, గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ప్రసంగం వింటే వారు మరింత ఆవేదనకు గురౌతారేమో!
గాంధీ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహాత్మాగాంధీ ఆదర్శాలను పుణికిపుచ్చుకుని స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఒక పరిశుభ్రమైన దేశాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అయితే, అంతకంటే ముందే మనం పచ్చదనం-పరిశుభ్రత అనే కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేయడం గమనార్హం. అదేవిధంగా, ప్రధానమంత్రి చేపడుతున్న స్వచ్ఛభారత్ మిషన్ లో తాను కూడా కన్వీనర్ గా పనిచేశాననీ, నివేదిక ఇచ్చిన విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం విశేషం!
అంతే, ఆ తరువాత ప్రధానమంత్రి గురించిగానీ, స్వచ్ఛ భారత్ అభియాన్ విషయంలో భాజపా సర్కారు చేస్తున్న కృషి గురించి అంతకుమించి మాట్లాడలేదు. పోనీ.. మాట్లాడిన ఆ మూడు వాక్యాల్లోనైనా భాజపాకి ఘనత దక్కే అవకాశం ఇచ్చారా అంటే అదీ లేదు! స్వచ్ఛ భారత్ కంటే ముందే మనం పచ్చదనం – పరిశుభ్రం కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. మోడీ కంటే ముందే ఇలాంటి ఆలోచనలు అమలు చేశామని చెప్పుకోవడమే కదా ఇది! అంతేకాదు, ప్రస్తుతం అమలు అవుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కన్వీనర్ గా పనిచేసి, నివేదిక ఇవ్వడాన్ని కూడా ఘనంగా చెప్పుకున్నారు. అంతేనా… రాష్ట్రం వ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మించాలనీ, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే సత్సంకల్పంతో తాను ముందుకుపోతున్నా అన్నారు! ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే… స్వచ్ఛత సేవా కార్యక్రమం క్రెడిట్ భాజపాకి దక్కదు అనేదే! రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న మరుగుదొడ్లుగానీ, ఇతర పరిశ్రుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలుగానీ, రోడ్ల నిర్మాణాలుగానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ సంకల్పం ప్రకారమే అమలు అమలు అవుతున్నాయన్నమాట! రాష్ట్ర భాజపా నేతలు ఈ ప్రసంగం వినే ఉంటారు కదా!