కౌంటింగ్ కు ముందే… టీడీపీ అధినేత చంద్రబాబు… టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎవరెవరో గెలవబోతున్నారో లెక్కలు తేల్చేందుకు.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పనితీరు, బూత్ ల వారీగా ఎవరికెన్ని ఓట్లు పడ్డాయి, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలు చేయబోతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది క్రియాశీలక నేతలను కూడా ఈ సమీక్ష సమావేశాలకు ఆహ్వానించారు. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆహ్వానించిన 350 మందితో సీఎం మాట్లాడతారు. ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి లోక్ సభ అభ్యర్థితో కూడా విడిగా మాట్లాడతారు.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ ల్లో మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు, అందులో ఎవరికెన్ని ఓట్లు పడతాయో కూడా లెక్కలను తీసుకురావాల్సిందిగా చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలతోపాటు పార్టీలోనే ఉంటూ ద్రోహం చేసిన వారి వివరాలను కూడా తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ తన దగ్గర ఉన్న లెక్కలతో పోల్చి చూసుకొని చంద్రబాబు అభ్యర్థులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే కుప్పం మోడల్ అంటూ.. ఓ ఫార్మాట్ ను… అందరికీ పంపిణీ చేశారు సీఎం కోరిన సమాచారంతో రావాలని అందరికీ ఆదేశాలు పంపారు. మొదటగా రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ సమావేశం ఉంటుంది. ఈ సమీక్ష సమావేశాలను హ్యాపీ రిసార్ట్స్ లో ఏర్పాటు చేశారు. క్యాంపాఫీస్‌లో… అయితే.. వైసీపీ అదే పనిగా ఫిర్యాదులు చేస్తూండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి పార్టీ నేతలను చంద్రబాబు… ఖాళీగా ఉంచే ఉద్దేశంలో మాత్రం లేరు. గత మూడు ఎన్నికల్లో బూత్‌ల వారీగా.. టీడీపీకి వచ్చిన ఓట్ల లెక్కలను తీసి మరీ.. విశ్లేషించబోతున్నారు. ఏ ఏ పోలింగ్ బూత్‌లలో ఎన్ని ఓట్లు వచ్చాయో చూసి… గెలుపోటములు… మెజార్టీలు లెక్కలు తేల్చబోతున్నారు. అంటే.. కౌంటింగ్ కాక ముందే.. రీ కౌంటింగ్ చేయబోతున్నారన్నమాట.