నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటనేది ఇంకా స్పష్టత రావడం లేదనే చెప్పాలి. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో జగన్ సర్కారు ఉందా అనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. అమరావతి ముంపు ప్రాంతంలో ఉందనీ, భవిష్యత్తులో వరదలు వస్తే పరిస్థితి ఏంటనే కోణంలో వైకాపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, అమరావతి ఎంపిక వల్ల ఆ చుట్టూ భూములున్న టీడీపీ నేతలు మాత్రమే బాగుపడ్డారనీ, పెద్ద అవినీతి జరిగిందనీ, అందుకే వారే ఇప్పుడు ఆందోళన చెందుతున్నారంటూ వైకాపా నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పోరాటానికి సిద్ధమౌతున్నారు.
రాజధాని రైతులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు… భూముల అంశమై తాము పోరాటానికి సిద్ధమౌతున్నట్టు ప్రకటించారు. తమతో కలిసి వచ్చే అన్ని పార్టీల మద్దతు తీసుకుంటామన్నారు. సీనియర్ నేతలతో త్వరలోనే ఒక కమిటీ నియమిస్తామనీ, రాజధాని అంశమై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. అమరావతిని ముంపు ప్రాంతంగా దుష్ప్రచారం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారనీ, ఇక్కడేదో అవినీతి జరిగిపోయిందని ఎంత వెతికినా ఏదీ దొరకదన్నారు. అవినీతిని వెలికి తీస్తామని చెబుతున్న జగన్ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలను ఆలస్యం చేస్తూ పోతోందన్నారు. వంద రోజుల వైకాపా పాలనపై ఒక పుస్తకం విడుదల చేస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ తాను పర్యటిస్తా అన్నారు.
అమరావతిపై అధికార పార్టీ ప్రకటనల దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసే చర్యలేవీ కూడా ప్రభుత్వం నుంచి కనిపించడం లేదు. అధికార పార్టీ వ్యూహం ఏదైనా కావొచ్చు… కానీ, కోట్లమంది ప్రజలను ఇలా గందరగోళానికి గురి చేయడం సరైంది కాదు. రాజధానిని మార్చడమే అంతిమ లక్ష్యం అనుకుంటే… యస్, మేం మార్చాలని డిసైడ్ అయ్యాం, మారుస్తాం. ఎందుకు మార్చాల్సి వస్తుందంటే.. ఇదిగో ఈ కారణాలతో అని ప్రజలకు సూటిగా వివరించే ప్రయత్నమైనా చేయాలి. లేదంటే.. ఈ కవ్వింపు ప్రకటనలకు ఫుల్ స్టాప్ అయినా పెట్టాలి. ఈ మధ్యేమార్గం దేనికి..? అధికార పార్టీ వైఖరితో రాజకీయంగా ఇది ప్రతిపక్షానికి బలమైన పోరాటాంశంగా మారుతోంది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మొదలుపెడుతున్న తొలి పోరాటం రాజధాని అంశమే కావడమే అవుతుంది.