హైదరాబాద్: అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటికెళ్ళి వ్యక్తిగతంగా ఆహ్వానిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇవాళ విజయవాడలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ, హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్, గవర్నర్ నరసింహన్, కేసీఆర్‌లను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తానని మంత్రులకు తెలిపారు. కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని మంత్రులకు సూచించారు. ఈనెల 18న హైదరాబాద్‌లో కేసీఆర్‌ను ఇంటికెళ్ళి ఆహ్వానిస్తానని చెప్పారు.
కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అయింది. శంకుస్థాపన అనేది పొరుగు రాష్ట్రంలో జరిగే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మామూలుగా అయితే వెళ్ళాలి. అయితే తెలంగాణలో వీరిరువురి నాయకత్వంలోని పార్టీల మధ్య నెలకొన్న పరిస్థితులు, ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల నేపథ్యంలో కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవటం అనుమానమే. కానీ పొరుగు రాష్ట్రంలో ముఖ్య కార్యక్రమం, అందులోనూ ప్రధానమంత్రి పాల్గొంటున్న కార్యక్రమం కాబట్టి లాంఛనంగా హాజరైతే మర్యాదపూర్వకంగా ఉంటుంది, గౌరవంగాకూడా ఉంటుంది. మరి కేసీఆర్ ఈ అవకాశాలలో దేనిని ఎంచుకుంటారో చూడాలి.