తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. వల్లభనేని వంశీమోహన్, మద్దాల గిరిని టీడీపీ నుంచి లాగేసింది. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొస్తే ప్రతిపక్ష హోదాపోతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరో ఇరువురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్ధతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. రాజధాని ఉద్యమం మరింత ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మొన్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి చంద్రబాబుతో మాట్లాడినప్పటికీ, ఆ తర్వాత విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయటాన్ని ఆయన స్వాగతించారు. దీంతో ఆయన కూడా పార్టీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఉండటంతో జెడ్ ఫ్లస్ కేటగిరి కూడా కొనసాగుతోంది. ఎన్ఎస్జీ రక్షణ కూడా ఉంది. ప్రతిపక్ష హోదా పోతే కేబినెట్ ర్యాంక్ ఉండే అవకాశంలేదు. దీనివల్ల చంద్రబాబుకు భద్రత కూడా తగ్గుతుంది. వైసీపీ నేతలు ఇదే చెబుతున్నారు. తాము ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే.. చంద్రబాబు ఇంటి ముందు ఉండే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉండదని.. కొడాలి నాని లాంటి వైసీపీ నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష హోదాను లేకుండా చేస్తామని.. కొద్ది రోజులుగా.. వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
తెలుగుదేశం రాజధాని ఉద్యమాన్ని బలపరుస్తున్న తరుణంలో ఆ పార్టీని నైతికంగా దెబ్బతీసి ప్రతిపక్ష హోదా పోగొట్టేందుకు, రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జరుగుతోన్న ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన తరుణంలో టీడీపీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రతిపక్ష హోదా అనేది భద్రతపై ప్రభావం చూపిస్తుంది కానీ.. ప్రజాపోరాటానికి అది ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటేనని టీడీపీ అంటోంది.