కడప ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అసలేమీ పట్టించుకోవడం లేదు. ఎంపీలందరూ వెళ్లి కేంద్రమంత్రిని కలిసినా.. ఆయన ఎప్పుడూ చెప్పే సమాధానమే చెప్పారు. తన చేతుల్లో ఏమీ లేదు..మోడీ ఓకే అంటే అదే వస్తుందన్నట్లుగా… కవర్ చేసుకున్నారు. దీంతో టీడీపీ ఎంపీలు చేసేదేమీ లేక ధర్నాకు సిద్ధమయ్యారు. మరో వైపు బీటెక్ రవి ఆరోగ్యం విషమించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారు. మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి…కడపలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉందని..అందుకే ఉక్కు పరిశ్రమ ఆలస్యమవుతుందన్నట్లుగా.. బీరేంద్రసింగ్ వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తను బీరేంద్రసింగ్‌కు ఓ లేఖ రాశారు. దాన్ని ఈ రోజు ఎంపీలు… ఉక్కు మంత్రి వద్దకు తీసుకెళ్లబోతున్నారు. 2020 కల్లా గనులు ఏపీ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయని… మూడు గనులు అందుబాటులోకి వస్తే 266 మిలియన్‌టన్నుల నిక్షేపాలు ఉంటాయని.. చంద్రబాబు లేఖలో కేంద్రమంత్రికి స్పష్టం చేయనున్నారు. ప్రస్తుతం ఇచ్చిన భూములలో 87 మిలియన్ టన్నుల ఖనిజం ఉందని .. ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు 150మిలియన్ టన్నులు ఖనిజం ఉంటే సరిపోతుందన్నారు. ఏపీ పంపిన డ్రాఫ్ట్ ఫీజిబిలిటి నివేదిక ఆర్నెళ్లు కేంద్రం వద్దే పెట్టుకుంది సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. భూములపై క్లారిటీ కావాలన్నట్లు కేంద్రమంత్రి మాట్లాడటంపైనా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కడపలో కేంద్రం పెట్టాల్సిన ఉక్కు పరిశ్రమలకు ఇచ్చే భూములపై ఎలాంటి వివాదం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అవి గతంలో గాలి జనార్ధన్‌రెడ్డికి ఇచ్చిన భూములు కావన్నారు. వేరే గనులు, వేరే భూములు చూపించినా కావాలనే ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు లేఖలో స్పష్టం చేయనున్నారు.
కేంద్రమంత్రితో బీరేంద్రసింగ్‌తో భేటీ తర్వాత కాలపరిమితితో కూడిన ప్రకటన రాకపోతే.. టీడీపీ ఎంపీలు ధర్నాకు దిగనున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో హామీ నెరవేర్చనందుకు.. కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడేలా.. తమంతట తామే .. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే… ఉక్కుపరిశ్రమను నిర్మించుకుంటామనే నిర్ణయాన్ని చంద్రబాబు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి భూమి, నీరు, మౌలిక సదుపాయాలతో పాటు భారీ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నింటినీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఇవే సౌకర్యాలు కల్పిస్తే.. ప్రైవేటు సంస్థలు చాలా ముందుకు వస్తాయి. విభజన చట్టంలో ఉంది కాబట్టే… సెయిల్ ద్వారా పరిశ్రమ పెట్టించాలని అడుగుతున్నామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడీ విషయంలో కేంద్రం ఇంకా కొర్రీలు పెడితే… వారు సిగ్గుపడేలా.. సొంతంగా ఉక్కుపరిశ్రమ ఏర్పాటును ఏపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.