తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిస్తే వృద్ధుల సామాజిక పెన్షన్లను నాలుగువేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవగానే మొదటే నిర్ణయం తీసుకున్నారు. సంతకం చేసి.. కేబినెట్లో తీర్మానం చేశారు. మూడు నెలల కిందట హామీ ఇచ్చినందున ఆ మూడు నెలల పాటు వెయ్యి బకాయిలు కూడా చెల్లించాలని నిర్ణయించారు. అంటే మొదటి నెల వృద్ధులకు తలా ఏడు వేల రూపాయలు అందుతాయి.
ఈ సందర్భంగా తానే స్వయంగా వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చంద్రబాబు పెన్షన్లను లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీన సోమవారం వస్తుంది. సచివాలయ ఉద్యోగులు శనివారం రోజునే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించారు. అందుకే సమస్యలు లేకుండా సోమవారం ఉదయమే పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తంభారీగా ఉంండటంతో వృద్ధుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ఉదయమే పెన్షన్ పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికి పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం నిరూపించనుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోవడం వల్లనే ఇంటింటికి పంపిణీ చేయలేదని దానికి కారణం చంద్రబాబు అని వైసీపీ విమర్శలు చేసింది. అదంతా కుట్ర అని వందల మంది మృతికి వైసీపీనే కారణం అని నిరూపించనున్నారు. చంద్రబాబు కూడా నేరుగా అమలు చేస్తున్న పథకాలపై మంచి ప్రచారం వచ్చేలా చూసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.