హైదరాబాద్: చిత్తూరులో నిన్న హత్యకు గురైన నగర మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ భౌతిక కాయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నివాళులు అర్పించారు. ఇవాళ మధ్యాహ్నం చిత్తూరు చేరుకున్న చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మృతుల భౌతిక కాయాలను సందర్శించిన తర్వాత నిన్న దాడి జరిగిన ప్రదేశాన్నికూడా పరిశీలించారు. కేసుగురించి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మాట్లాడుతూ, హత్యా రాజకీయాలను ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని చెప్పారు. పథకం ప్రకారమే హంతకులు దాడి చేశారని అన్నారు. మగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. అన్ని కోణాలలో దర్యాప్తు జరుగుతుందని అన్నారు. ఈ ఘటన తనను బాధించిందని చెప్పారు.
మరోవైపు భారీవర్షాలతో దెబ్బతిన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. కొద్ది ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేసిన తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి తిరిగి వచ్చేశారు. అక్కడనుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు చేరుకుని అనూరాధ దంపతులకు నివాళులర్పించి అక్కడనుంచి విజయవాడ వెళ్ళారు.