ఐదేళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమూలంగా నాశనం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసమర్ధులు పాలన చేస్తే ఏం జరుగుతుందో జగన్ పాలన ఉదాహరణ అని వివరించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు.
ఏపీ ప్రజల భవిష్యత్ ను వైసీపీ ఎలా దెబ్బతీసిందో వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలు మాపై నమ్మకంతో పెద్ద బాధ్యతను ఉంచారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని కోరాం. మా పిలుపుకు ఏపీ ప్రజలు స్పందించారు. అన్ని శాఖలలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజల ముందు వాస్తవాలు ఉంచేందుకు ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు చంద్రబాబు.
నేను చేపట్టిన విద్యుత్ సంస్కరణల వలన అధికారం కోల్పోయినా దేశం బాగుపడింది. నా సంస్కరణలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ కనిపించాయి. విద్యుత్ చార్జీలను పెంచకుండా చర్యలు చేపట్టాం. 2014-19లో సౌర శక్తి, పవన్ విద్యుత్ ఉత్పత్తి పెంచాం. ఫలితంగా 2018నాటికి విద్యుత్ మిగులు రాష్టం ఏపీ ఎదిగిందని అన్నారు. కానీ, గత ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజలపై 32,166కోట్ల భారాన్ని మోపిందని, విద్యుత్ రంగంలో 49,596 కోట్ల అప్పు చేసిందన్నారు.
వైసీపీ సర్కార్ గతంలో గృహ వినియోగదారులపై 45శాతం చార్జీలు పెంచగా, యాబై యూనిట్లు వాడిన పేదలపై వందశాతం చార్జీలు పెంచిందన్నారు. వేల కోట్ల ఋణం తీసుకొని విద్యుత్ రంగంపై భారం మోపారని, జగన్ పాలనలో విద్యుత్ రంగం 47,741కోట్లు నష్టపోయిందని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ విధానాల వలన ప్రజలకు , ప్రభుత్వానికి 1,29,503కోట్ల నష్ట జరిగిందని, గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తామని చెప్పారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.