ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో మాట్లాడారు. అందరికీ అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అయితే, ఎన్నికల ఫలితాల వెలువడిన దగ్గర్నుంచీ టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ అభిప్రాయం ఏంటంటే… పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు కొనసాగుతూ, అసెంబ్లీలో మరో నాయకుడి ఆధ్వర్యంలో పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉంటుందా అని ప్రతిపాదన తెరమీదికి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఆయన కూర్చుంటారా, తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ను… నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఫేస్ చేస్తారా అనే చర్చా జరిగింది. అయితే, నిన్నటి మీటింగ్ తో కొంత స్పష్టత వచ్చినట్టే. అయినా… తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనుభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే… ఏపీలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీ ముందుకు నడవాల్సిన అవసరమేంటో స్పష్టంగా అర్థమౌతుంది.
2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. అయినాసరే, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మిత్రపక్షాలతో కలిపి దాదాపు 20 సీట్లు సాధించింది. ఆ తరువాత, ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విజయవాడకు మకాం మార్చారు. అనంతరం, తెలంగాణ టీడీపీ శాఖ బాధ్యతలను కూడా తగ్గించుకున్నారు. స్వతంత్రంగా వ్యవహరించి, పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యతను తెలంగాణ నాయకుల మీద పెట్టేశారు. ముఖ్యమంత్రిగా ఏపీ కార్యకలాపాల్లో బిజీబిజీ అయిపోయారు. అక్కడి నుంచే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దశాదిశా లేకుండా పోయింది. వలసలు పెరిగాయి. రానురానూ పార్టీ ఉనికే ప్రమాదంలో పడింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ పొత్తు మీద ఆధారపడాల్సిన పరిస్థితి. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి… పోటీ నుంచి దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.
తెలంగాణ టీడీపీని చంద్రబాబు నాయుడు వదిలేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనడంలో సందేహం లేదు. కాబట్టి, ఏపీలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటూ, బాధ్యతలు తగ్గించుకుంటే ఏమౌతుందనేది ఆయనకి విశ్లేషించుకోలేని అంశమైతే కాదు. ఓపక్క, తెలంగాణ అనుభవం ఉంది. కాబట్టి, గతం కంటే ఎక్కువగా ఇప్పుడు పార్టీకి ఆయన అవసరం ఉంది. ఇక, వయోభారం అంటారా… చంద్రబాబు నాయుడు పట్టుదల ఏంటో అందరికీ తెలిసిందే. సవాళ్లను ఎదుర్కోవడం ఆయనకి కొత్త కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధీటుగా పార్టీకి నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఏ రకంగా చూసుకున్నా… టీడీపీ బాధ్యతలను ఆయన కొంత తగ్గించుకుంటారూ అనే చర్చకు పెద్దగా ప్రాధాన్యత లేదనే అనిపిస్తోంది.