టీఆర్ఎస్ .. బీఆర్ఎస్గా మారిపోయింది. ఏపీలోనూ ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. ఇక సమైక్యవాద పార్టీలుగా ముద్ర వేసిన పార్టీలు తెలంగాణలో అడ్డేముంటుంది ? ఈ అడ్వాంటేజ్‌ను చంద్రబాబు తీసుకుంటున్నారు. తమకు బలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను చీఫ్‌గా చేసి.. చంద్రబాబు కార్యకలాపాలు వేగం పెంచేలా చేసుకుంటున్నారు.
తాజాగా ఆయన ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు. ఈ నెల 21న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు టీటీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొననున్నారు.హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. చంద్రబాబు ర్యాలీ, ఖమ్మంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలిరావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా పలువురు సీనియర్ నేతలను నియమించారు. గతంలో టీటీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు.. ఖమ్మంలో పార్టీ బలంగా ఉందని, అక్కడ బహిరంగ సభ నిర్వహించాల్సిందిగా సూచించారు. చంద్రబాబు సూచనతో ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభకు ఇప్పుడు టీటీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు.ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. గతంలో గోదావరి వరదల సమయంలో కూడా భద్రాచలంలో చంద్రబాబు పర్యటించారు. ఖమ్మం తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌పై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఖమ్మం తర్వాత సెటిలర్లు ఎక్కువమంది నివాసం ఉంటున్న గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీకి కాస్త పట్టుంది. టీడీపీ పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ .. బీఆర్ఎస్ రాజకీయాలతో టీడీపీకి కూడా తెలంగాణలో అడుగు పెట్టే అవకాశం లభించినట్లయింది.