ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో కేంద్రవైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ఒకవైపు కేంద్రంతో చర్చలు సాగిస్తూనే, రెండేళ్ళయినా కేంద్రప్రభుత్వం విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో తన మాట నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రెవెన్యూ లోటు భర్తీ వంటి అన్ని హామీల అమలుకోసం కేంద్రప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చూస్తూనే ఉన్నామని, వాటిని సాధించేవరకు ఇంకా ఒత్తిడి చేస్తూనే ఉంటామని చెప్పారు.
కేంద్రంపై ఒత్తిడి పెరిగిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులతో చర్చలు మొదలుపెట్టింది. అవి తుది దశకు చేరుకొన్నాయని త్వరలోనే రాష్ట్ర ప్రజలకి శుభవార్త వినిపిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలలో ఇంకా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనిస్తే, ఆ చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు అనుమానం కలుగుతోంది.
ప్రత్యేక హోదా, రైల్వేజోన్ హామీలని కేంద్రప్రభుత్వం అమలుచేయడానికి సిద్దంగా లేదనే విషయం ఇప్పటికే స్పష్టం అయ్యింది. కానీ రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఆ రెంటి విషయంలోనే చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక వాటికి ప్రత్యామ్నాయంగా ఏది తీసుకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకి, ప్రతిపక్షాలకి సంజాయిషీలు చెప్పుకొని వారిని ఒప్పించవలసి వస్తుంది. అది అసాధ్యమేనని చెప్పవచ్చు. ఆ రెంటి విషయంలో అటు కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించలేక, ఇటు ప్రజలని ప్రతిపక్షాలని ఒప్పించలేని పరిస్థితిలో ఉన్నందునే చంద్రబాబు నాయుడు మాటలలో అసంతృప్తి వ్యక్తం అయ్యుండవచ్చు.
రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి అందిస్తామని చెపుతూనే రాష్ట్రానికి ఈయవలసిన నిధులని చేతికి ఈయకుండా వాటిని బాకీలు, వడ్డీలు లేదా అటువంటి వేరే పద్దులలో కేంద్రం సర్దుబాట్లు చేసేస్తోంది. బహుశః అదీ చంద్రబాబు అసంతృప్తికి ఒక కారణం అయ్యుండవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చేవరకు ఇటువంటి అనిశ్చిత వాతావరణం కొనసాగూతూనే ఉండవచ్చు.