పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పెళ్లికి వచ్చి మన నాయకుడితో మాట్లాడితే దానిపై రభస చేస్తారా అని ముఖ్యమంత్రి, టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహించారట. నిజమైతే కావచ్చు గాని దానికి మూలం మాత్రం ఆ పార్టీ నాయకత్వం అత్యుత్సాహమే.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు వచ్చినా దాన్ని పెద్ద ఈవెంట్ చేయాలనే తాపత్రయం ఇందుకు కారణమవుతున్నది. పెళ్లికి రావడమే కెసిఆర్ బాధ్యత అయితే తర్వాత అక్కడ జరిగిన హడావుడికి అతికీ బాధ్యత అక్కడి వారిదే కదా! ఇందులో చంద్రబాబు ద్వంద్వ రాజకీయానిదీ పాత్ర వుంది. రాష్ట్రాల మధ్య సంబంధాలను రాజకీయ సామాజిక కోణాలలోకి మరల్చే ప్రయత్నమే ఒక పొరబాటు. దానివల్ల పెళ్లికి వచ్చిన సుహృద్భావం కన్నా తర్వాత వివాదం ఎక్కువై పోయింది. అది కూడా అంతర్గతంగానే రావడం మరింత విపరీతం. పరిటాల రవి సమాధిని సందర్శించడం, పయ్యావుల కేశవ్‌తో మాట్లాడ్డం వీటిని వివాదం చేసింది టిడిపి నేత రేవంత్ రెడ్డి తప్ప ఇతరులు కాదు. దానిపై అధికారికంగా కుల వ్యూహం ఏమిటో బయిటపెట్టిన ఆర్కే కూడా వారి మిత్రులే. వాస్తవానికి ఆ పెళ్లిలో ఎపి మంత్రులందరూ చంద్రబాబును పట్టించుకోకుండా కెసిఆర్ వెంటపడ్డారని టిటిడిపి నేతలతో సమావేశంలో వచ్చిన ఫిర్యాదు. పొత్తులపై అప్పుడే మాట్లాడొద్దని చెప్పడం తప్ప చంద్రబాబు ఇచ్చిన స్పష్టత ఏమీ లేదు. కాకుంటే టిఆర్ఎస్తో కలవాలనే ప్రతిపాదన రాలేదని మాత్రమే టిటిడిపి అద్యక్షుడు రమణ ఇచ్చిన వివరణ. వచ్చే అవకాశం లేదని మాత్రం ఆయన చెప్పలేదు! ఇక బిజెపితో సంబంధాలు మరీ విచిత్రంగా వున్నాయి. ఇవన్నీ రాజకీయ స్థాయిలో వుంటే కేవలం స్థానిక నేతలను మందలించడం వల్ల ఉపయోగం శూన్యం. ఇంత చేసినా కెసిఆర్ తెలంగాణలో టిడిపి ఎక్కడ వుందని వ్యాఖ్యానించడంతో మెతకవైఖరి ప్రతిపాదించేవారు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణకు సంబంధించిన ఈ సమస్యకు ఆంధ్ర ప్రదేశ్ నేతలనూ మందలించడం ద్వారా చంద్రబాబు అక్కడా సమస్య వుందని చెబుతున్నారన్నమాట. మంత్రులు తమకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దని ఆయన మరో హితోపదేశం చేశారట. మొత్తంపైన టిడిపి అధినేతలో అసంతృప్తి తీవ్రంగానే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది.