హైదరాబాద్: దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరానికి మరో ఆకర్షణ వచ్చి చేరింది. ప్రముఖ తెలుగు నిర్మాత కేఎల్ నారాయణ బెంజ్ సర్కిల్లో నిర్మించిన ట్రెండ్‌సెట్ మాల్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఇవాళ ప్రారంభించారు. ఈ మాల్లోనే సురేష్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ల్యాబ్స్ కలిసి ఏర్పాటు చేసిన 6 స్క్రీన్ల క్యాపిటల్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను కూడా వారు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీఎమ్ మాట్లాడుతూ, నవ్యాంధ్రకు వచ్చే తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. రాజధాని అభివృద్ధికి ఇలాంటి మాల్స్ దోహదపడతాయని అన్నారు. కృష్ణాజిల్లాలో మేధావులు ఎక్కువగా ఉన్నారని, వాళ్ళ మేధస్సు రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రాజధాని అంటే కాంక్రీట్ బిల్డింగులు, రోడ్లే కాదని, అక్కడ జీవం ఉండాలని, విద్యాసంస్థలు, వినోదం, వ్యాపారం, వైద్యం అన్నీ ఉంటేనే జీవం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులతోపాటు హీరో వెంకటేష్ కూడా పాల్గొన్నారు.