ఇప్పటికే వైకాపా నుంచి ఇరవైమంది ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించింది. కొందరు పదవుల కోసం వెళ్తే, మరికొందరు అధికార పార్టీలో ఉండటం ద్వారా పొందే ప్రయోజనాల కోసం చేరినవారే! ఇంతకీ.. వైకాపా నేతలు టీడీపీ వైపు ఎందుకు అంతగా ఎగబడుతున్నారు అనేదానికి గతంలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు టీడీపీ నేతలు! తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచీ ఆంధ్రా ఎన్నో కష్టాల్లో ఉందనీ, చుట్టూ ఎన్ని ఇబ్బందులున్నా రోజుకి 18 గంటలు కష్టపడి చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారనీ చెప్పుకుంటారు! ఆ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలన్న సదుద్దేశంతో ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి వస్తున్నారని చెప్పేవారు. ఇంకో నిర్వచనం ఏంటంటే… ప్రతిపక్ష పార్టీలో నాయకులు ఇమడలేకపోతున్నారనీ, ఆ పార్టీ అధినేత జగన్ నిరంకుశ విధానాలతో విసిగివేశారి టీడీపీలోకి వచ్చేస్తున్నారనే నిర్వచనమూ ఉంది. ఇలా సందర్భానుసారంగా ఫిరాయింపులకు కొత్త కొత్త అర్థాలూ తాత్పర్యాలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఇలాంటిదే మరొకటి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు!
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడం కేవలం లాంఛనం మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తన అనుచరులకు రేణుక పసుపు కండువా కప్పించారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిని ఆమె దగ్గరుండి టీడీపీలో చేర్చారు. ఇక, త్వరలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆరోజే ఆమె టీడీపీలో అధికారికంగా చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సరే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలసి వచ్చేవారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. ‘పార్టీలకు అతీతంగా ప్రజల కోసం అందరూ పనిచేయాలని సీఎం అయిన దగ్గర నుంచీ నేను చెబుతూనే ఉన్నాను’ అన్నారు. కొంతమందికి సహకరించాలని మనసులో ఉందనీ, కొన్ని కారణాల వల్ల బయటకి రాలేకపోవచ్చనీ, మంచిని ప్రోత్సాహించాలీ అభివృద్ధిని అడ్డుకోకూడదనే ఆలోచనతో వస్తున్నవారందరినీ మనస్ఫూర్తిగా అభనందిస్తున్నా’ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం అవుతాననే లక్ష్యంతో రేణుక ముందుకొచ్చారనీ, వారిని మరొక్కసారి అభినందిస్తున్నా అన్నారు.
ఫిరాయింపులకు తాజా అర్థం ఏంటంటే.. ‘పార్టీలకు అతీతంగా పనిచేయడం’! ఇదే మాట తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ చెప్పుకొస్తున్నానని చెప్పడం మరీ విడ్డూరం. ఈ ఫిరాయింపుల ప్రక్రియకు ఎన్నిరకాల కొత్త ముసుగులు వేసినా.. ఇదొక చెడు సంప్రదాయం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాతీర్పును ఎప్పటికప్పుడు వెక్కిరిస్తూ ఉండటం. పదవులకు రాజీనామాలు చేయని నేతల్ని అధికార పార్టీలో ఎలా చేర్చుకుంటారు..? హఠాత్తుగా ఈ ‘అభివృద్ధిలో భాగస్వామ్యం’ అనే భావన వారిలో ఎలా వచ్చేస్తోంది..? పార్టీ మారితే తప్ప ప్రజల కోసం వీరంతా పనిచేయలేరా..? అధికార పార్టీ పంచన చేరితే తప్ప అభివృద్ధిలో భాగస్వాములు కాలేరా, పార్టీలకు అతీతంగా మంచి పనులకు సహకరించలేరా..? ఇంత బహిరంగంగా ముఖ్యమంత్రే ఫిరాయింపుల్ని ఎంతో పద్ధతిగా ప్రోత్సహిస్తుంటే ఏమనుకోవాలి..?