“మేం అధికారంలో ఉన్న ప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన మాట నిజమే. అయితే, ప్రజాభిప్రాయాన్ని, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రతిపాదనను విరమించాం. స్థానిక గిరిజనుల అభిప్రాయాలను, పర్యావరణ సమస్యల ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు.” విశాఖపట్టణంజిల్లా అనంతగిరి సభలో 2010 నవంబరు 18 న ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు.
అయితే, కొంతకాలంగా జర్నలిస్టులు, నాయకులు ఊహిస్తున్నట్టుగానే, స్ధానికులు భయపడుతున్నట్టుగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మాటతప్పారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ డివిజన్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేశారు. ఈ మేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీకుమార్ పరీదా గురువారం జారీ చేసిన 97 జిఓ ప్రకారం నంబర్ నర్సీపట్నం అటవీ డివిజన్ పరిధిలోని చింతపల్లి, జెర్రిల వద్ద 1212 హెక్టార్ల అటవీ భూమి బాక్సైట్ తవ్వకాల కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు దఖలు పడుతుంది.
జీవో జారీ చేయడమే ఆలస్యం అన్నట్లు ఖనిజాభివృద్ధి సంస్థ శుక్రవారం నుంచే ఈ ప్రక్రి యను చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తుంది. అల్యూమినియమ్ ఉత్పత్తిక ముడిపదార్ధమైన బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం త్వరలోనే యూజర్ ఏజెన్సీని ఎంపిక చేయనుంది. ఏజెన్సీ ఏదైనా జిందాల్ కంపెనీ రెండో రిఫైనరీకే బాక్సైటు చేరుతుంది.
బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనుల బతుకులు విధ్వంసమవుతాయని పర్యావరణ వేత్తలు మొదటి నుంచీ హెచ్చరిస్తున్నారు.బాక్సైట్ తవ్వకాలపై కేంద్రప్రభుత్వం నియమించిన కేంద్ర సాధికార కమిటీ కూడా బాక్సైట్ తవ్వకాల వల్ల అటవీ సంపద అపారంగా దెబ్బతింటుందని నివేదిక ఇచ్చింది. అటవీ, రెవెన్యూ భూములకు ఏర్పడే నష్టాలతో పాటు బాక్సైట్ ఖనిజం తీసే ప్రాంతం నుంచి పదికిలోమీటర్ల పరిధిలోని భూములకు నష్టం జరుగుతుంది. జర్రెల అటవీ ప్రాంతంలో 2,500 హెక్టార్లలో అటవీ భూమి నాశనమవడం వల్ల గిరిజనుల సాంప్రదాయక అటవీ ఉత్పత్తుల సేకరణ దెబ్బతింటుంది అని కమిటీ నివేదికలో పేర్కొంది. అటవీ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణా, తవ్వకాలు చేయవలసి వస్తే చట్టం ప్రకారం అధికారులు పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి విషయం వివరించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించాలి. అయితే ఈప్రాసెస్ ను జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదు.నియమ నిబంధనలను పక్కనపెట్టి అయినా సరే పనికానివ్వడమే ముఖ్యమని స్వయంగా ప్రభుత్వాధినేతే తలపెట్టినపుడు అధికారులు చట్టాల్ని పక్కనపడేయడంలో ఆశ్చర్యమేమీ వుండదు.
బాక్సైట్ తవ్వకాలు చేపడితే సామాజికంగా, పర్యావరణపరంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని అప్పటి కేంద్ర గిరిజన శాఖ మంత్రి వైరిచర్ల కిషోర్చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్కు లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ టిడిపికి చెందిన ముగ్గురు కార్యకర్తలను మావోయిస్టులు అపహరించడంతో మాజీ మంత్రి మణికుమారి పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ విషయం ప్రశ్నించినపుడు నిర్ణయం తీసుకోలేదు గదా చంద్రబాబు అని సమాధానాన్ని దాటవేశారు. నెలతిరగకుండానే బాక్సైట్ తవ్వకానికి జిఓ జారీ చేసేశారు.
బాక్సైట్ త్రవ్వకాలకు అనుమతులివ్వడంలో మారింది అధికార పార్టీయే తప్ప ఇందులో కాంగ్రెస్ కు తెలుగుదేశానికి విధానపరమైన తేడా ఏమీలేదని చంద్రబాబు మాట తప్పి మరీ రుజువు చేసేశారు.