వైసీపీలో అంతర్గత రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో చంద్రబాబునాయుడితో తానే ఢీ అంటే ఢీ అంటున్నానన్నట్లుగా కనిపించేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిత్తూరుజిల్లాలో టీడీపీ కార్యకర్తల్ని అణిచి వేయడం ద్వారా చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పందించేలా చేసుకుని వెంటనే.. చంద్రబాబుకు ఆయన కౌంటర్ ఇచ్చేందుకు తెరపైకి వస్తున్నారు. చంద్రబాబు కుప్పం టూర్ నుంచి ఇది మీర ఎక్కువయింది. చంద్రబాబు వ్యాఖ్యలకు పెద్దిరెడ్డి సవాల్ చేస్తూ వస్తున్నారు.
కుప్పం నుంచి పోటీ చేస్తానంటున్న పెద్దిరెడ్డి
తాజాగా తాను కుప్పం నుంచి పోటీకి రెడీ అని ప్రకటించారు. ఇక్కడ తనకు తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ కత్తిరిస్తాడు కాబట్టి..ప్లాన్డ్ గా జగన్ అనుమతిస్తే అనే మాట వాడారు. ఓ పనైపోతుందని జగన్ ఎక్కడ జగన్ అనుమతిస్తారోననే భయంతో.. తాను కుప్పంలో ఒక్క చోటే కాదని పుంగనూరులో కూడా పోటీ చేస్తానని.. రెండు చోట్ల పోటీకి సిద్ధమని చెప్పుకున్నారు. దీంతో ఆయన మాటల్లో ఉన్న డొల్లతనం స్పష్టమయింది. చంద్రబాబును కూడా రెండు చోట్ల పోటీకి రావాలని సవాల్ చేశారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడానికి పెద్దిరెడ్డి వస్తే..ఇక చంద్రబాబు పుంగనూరు వస్తే ఏంది.. రాకపోతే ఏంది.. తేల్చుసుకుంటారు కదా అని టీడీపీ నేతలంటున్నారు.
జగన్ వల్ల కాదని చంద్రబాబుకు తానే సరైన ప్రత్యర్థినని చూపించుకుంటున్నారా?
అయితే పెద్దిరెడ్డి ఇదంతా వ్యూహం ప్రకారమే చేసుకుంటున్నారని.. చంద్రబాబుకు పోటీ నేతగా తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వైసీపీలో రాజకీయాలు లోపల్లోపల ఏం జరుగుతుందో తెలియనట్లుగా ఉంది. బీజేపీతో టచ్లో ఉండే ఓ సీనియర్ 70 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్ ఫైల్స్ ద్వారా బయట పెట్టారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. వైసీపీలో కొన్ని వ్యవహారాలు మాత్రం.. ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని కల్పించేలా ఉంటున్నాయి.
వైసీపీలో అంతర్గత రాజకీయ పరిణామాలతో పెద్దిరెడ్డి తీరుపై గుసగుసలు !
కారణం ఏదైనాపెద్దిరెడ్డి మాత్రం ఎప్పుడూ లేని విధంగా.. తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు పక్కారాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం మొత్తం పెద్దిరెడ్డి చేతుల్లో ఉంది. ఈ జిల్లాలో జగన్ ఆదేశాలు కూడా నేరుగా చెల్లవు. ఏదైనా పెద్దిరెడ్డి చెప్పాల్సిందే చేయాల్సిందే. కొత్తగా ఆయన జిల్లాల విభజనతో.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలోనూ పట్టు సాధించుకుంటున్నారు. జగన్ చంద్రబాబుపై బహిరంగసభల్లో మాత్రమే విమర్శలు చేస్తారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం నేరుగా చంద్రబాబుతో తానే పోరాడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. ఈ ఇమేజ్ వ్యూహం ప్రకారమే ఏర్పాటు చేసుకుంటూండటం ఆసక్తికరం.