ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సొంత రాష్ట్రంలో ఓటు వేయడం ఆనందంగా ఉందనీ, గర్వంగా ఉందన్నారు. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్న అంశాన్ని విలేకరులు ఆయన ముందు ప్రస్థావించారు. దీనిపై స్పందిస్తూ… అభివృద్ధి చెందిన దేశాలు, సాంకేతికంగా బలంగా ఉన్న దేశాలు కూడా ఈవీఎంలు వాడటం లేదన్నారు. అందుకే, ఈవీఎంలపై చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాననీ, పేపర్ మీద ఓటు వేస్తేనే ఎవరికైనా సంతృప్తిగా ఉంటుందన్నారు.
సాంకేతికతను అన్ని చోట్లా వాడుకుంటున్నా, ఎన్నికలకు వచ్చేసరికి ఈవీఎంలు సరికాదన్నారు. పేపర్ బేలెట్ ఉంటే ప్రతీ నిమిషం కరెక్ట్ గా ఓటింగ్ జరిగేదన్నారు. ఈరోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా పేపర్ బేలెట్ కి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. కానీ, కావాలనే ఈవీఎంలు ఉండాలని మాట్లాడుతూ ఉండటం సరికాదన్నారు. మెషీన్లు సరిగా పనిచేయలేదంటూ ఉదయం నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల మోసగాళ్లకు ఆస్కారం ఉంటుందన్నారు. అందుకే తాను మొదట్నుంచీ పోరాటం చేస్తున్నాననీ, సుప్రీం కోర్టుకు వెళ్లానన్నారు.
స్లిప్పులు లెక్కించాలని ఎలక్షన్ కమిషన్ ని కోరితే దానికి ఆరు రోజులు పడుతుందని చెప్పడం సరికాదన్నారు. స్లిప్పు మీద గుర్తు, పేరు ఉన్నప్పుడు వాటిని లెక్కించడానికి ఆరు రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు? గంటల్లో అయిపోయే పనిని కూడా కావాలనే ఆరేడు రోజులు పడుతుందని సాకులు చెప్పడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేయడమే అన్నారు. అందుకే, దీనిపై రివ్యూ పిటీషన్ కి వెళ్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు ఎదురౌతున్న ఇబ్బందుల్ని గుర్తించాల్సిలవనీ, పాఠాలు నేర్చుకోవాలనీ, పద్ధతిని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.