గత ప్రభుత్వంలా ఈ కూటమి సర్కార్ కక్షసాధింపు చర్యలు చేపట్టదని, అయితే గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కూటమి శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలకు ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అక్రమాలకు పాల్పడిన నేతల పట్ల సానుభూతితో వ్యవహరిస్తే వాటిని భవిష్యత్ లోనూ కొనసాగించే ప్రమాదముందన్న చంద్రబాబు… అలాంటి నేతలను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేయడంతో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలు త్వరలోనే చిక్కులు ఎదుర్కోక తప్పదని పరోక్షంగా స్ట్రాంగ్ మెసేజ్ పంపారు.
తాము ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగబోమని చట్టపరంగానే దోషులను శిక్షిస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఐదేళ్ళుగా కొనసాగిన విధ్వంస , కక్ష సాధింపు రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులతో పాటు అక్రమ కేసులను నమోదు చేసి వేధించారని.. అయినా వాటన్నింటిని ఎదుర్కొంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.