అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టారు. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. అసెంబ్లీలో రెండో రోజు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణిపై పాలక పక్ష సభ్యులు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడేందుకు స్పీకర్ చాన్స్ ఇవ్వలేదు. చంద్రబాబు మాట్లాడుతూండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. తర్వాత ప్రెస్మీట్ పెట్టారు.
చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మాటలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. రెండు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేకపోయారు. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. అయినా ఈ రోజు తన భార్యను, కుటుంబసభ్యులను కూడా రోడ్డు మీదకు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను గెలిచినప్పుడు పొంగిపోలేదని.. ఓడినప్పుడు కుంగిపోలేదన్నారు. తాను అధికారంలో ఎప్పుడు ఉన్నా ఎవర్నీ కించ పరచలేదన్నారు.
కానీ ఇప్పుడు తన భార్యను కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారన్నారు. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. అయినప్పటికీ ఆమెను కూడా వదిలి పెట్టకుండా వ్యాఖ్యలు చేశారన్నారు. వారి ఇళ్లలోని మహిళలపై ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఈ అవమాలన్నింటిపై ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే తాను అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. ధర్మాన్ని గెలిపించాలా.. అధర్మాన్ని గెలిపించాలా అన్నది ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తానన్నారు.
అయితే సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయన కుటుంబంపై ఎవరూ మాట్లాడలేదని కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చన్నారు. చంద్రబాబే తన తల్లి, చెల్లి , బాబాయ్ గురించి మాట్లాడారన్నారు.