తెలుగుదేశం పార్టీ ఏది గొప్పగా ప్రకటించుకున్నా వెంటనే వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి.. విచిత్రమైన వాదనలతో అసలు చంద్రబాబుకు ఆ క్రెడిట్లో వాటా లేదని వాదిస్తూ ఉంటుంది. కియా పరిశ్రమ ఏపీకి రావడానికి పదేళ్ల కిందటే చనిపోయిన వైఎస్ఆర్ కారణం అని .. మూడేళ్ల కిందట ్సెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పడం ఇప్పటికీ ఎవరూా మర్చిపోలేరు. అలాంటిది ఈ సారి మాత్రం టీడీపీ ట్రెండింగ్‌కు వైసీపీ నేతలు సైలెంట్ కాక తప్పలేదు.
హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ ఇరవయ్యో వార్షికోత్సవ ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. అంతే టీడీపీ నేతలు అంత కంటే కావాల్సిందేముందని.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేసుకున్నారు. చంద్రబాబు ఎలా ఐఎస్బీని హైదరాబాద్‌లో పెట్టడానికి అంగీకరింప చేశారన్న దగ్గర్నుంచి అన్ని విషయాలను పూసగుచ్చినట్లుగా పాత రికార్డులను బయటకు తీసి చెబుతున్నారు. ఐఎస్బీ వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించిన వారి ఇంటర్యూల్లో చంద్రబాబు ప్రస్తావన తప్పక ఉంటుంది. దాన్ని హైలెట్ చేస్తున్నారు.
చంద్రబాబు పట్టుబట్టకపోతే.. ఐఎస్బీ హైదరాబాద్ వచ్చేది కాదు. ఆ విషయం అనేక మంది చెబుతారు. అయితే చంద్రబాబు పదవి నుంచి దిగిపోయాక.. ఏ సందర్భంలోనూ ఆయనను పట్టించుకోలేదు. చివరికి ఇరవయ్యో వార్షికోత్సవంలోనూ ఆయన పేరు కనిపించలేదు. దీనికి కారణం… చంద్రబాబు అధికారంలో లేకపోవడం.. రాజకీయ ప్రత్యర్థులు ఉండటమే. అయితే.. ముగింపు ఉత్సవాల్లో మాత్రం చంద్రబాబు పాల్గొనేలా చూశారు.. ఐఎస్బీ అధికారులు.
ఐఎస్బీ విషయంలో వైఎస్ గొప్పతనం ఏమైనా ఉంటే.. చిలువలు పలువులుగా చెప్పుకోవడానికి ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తారు. అలాంటిదేమీ లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియాదే పైచేయి అయింది.