పాతికేళ్ల కిందటే చంద్రబాబు ఢిల్లీ స్థాయి లీడర్. ఓ పదేళ్ల పాటు చక్రం ఆయన చేతుల్లో ఉండేది. తాను అనుకున్నది చేసేవారు. అయితే తర్వాత చంద్రబాబుకు టైం కలసి రాలేదు. మళ్లీ ఆ స్థాయి రాజకీయం ఇప్పుడు చూపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెట్టక ముందు నుంచి రాజకీయం ఆయన చుట్టూనే తిరుగుతోంది.
బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అయితే చంద్రబాబు తాము ఎన్డీఏతోనే ఉంటామని ఈ ఉదయం ప్రకటించడంతో మళ్లీ ఒక్క సారిగా పుంజుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ మదుపర్లు అంతా చంద్రబాబును గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు ప్రైమ్ మినిస్టర్ రేంజ్ లో స్వాగతం లభించింది. ప్రోటోకాల్ ఆ స్థాయిలో ఇచ్చారు.
చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో తమకు కీలక భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారని జాతీయ మీడియా ప్రకటించింది. స్పీకర్ పదవితో పాటు మూడు కేంద్ర మంత్రి పదవుల్ని అడుగుతున్నారని అవి కూడా కీలకమైన ఫోర్ట్ ఫోలియోలు కోరుతున్నారని జాతీయ మీడియా చెబుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రాధాన్యం దృష్ట్యా ఆయన గతంలో చూపిన రాజకీయ చాణక్యాన్ని అంచనా వేసుకుని కావాల్సినవన్నీ పొందుతారని చర్చలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు ఇండియా కూటమి వైపు వస్తారంటూ కొంత మంది మైండ్ గేమ్ ఆడుతున్నారు. వారెవరికీ చంద్రబాబు కౌంటర్ ఇవ్వడం లేదు. తాము ఎన్డీఏ తరపున పోటీ చేశామని.. వేరే కూటమి గురించి అసలు చర్చ ఎందుకు వస్తుందని ఒక్క మాటతో మీడియాకు క్లారిటీ ఇచ్చారు. మరో మూడు నాలుగు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లు చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా ఉండనున్నారు.