లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ ఇంటికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై .. వైసీపీ నేతలు, మంత్రులు ఒకే ఒక్క విమర్శ సీరియస్‌గా చేస్తున్నారు. అదే ఆయన హైదరాబాద్‌లో ఉండిపోవడం. హైదరాబాద్ క్వారంటైన్లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉండాలని అంటున్నారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో ఉన్నారని చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ.. ఆయన ఏపీకి రావాలని డిమాండ్ చేయడమే కాస్త విచిత్రంగా ఉందని.. టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా.. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చి.. చంద్రబాబు రాజకీయ పర్యటనలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ఏపీకి వచ్చి.. అన్ని క్వారంటైన్ సెంటర్లను పరిశీలిస్తారని.. దానికి ప్రభుత్వం అనుమతిస్తుందా.. అని చాలెంజ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు ఏపీకి వచ్చి మాట్లాడాలనే మాటనలు.. సీరియస్‌గా తీసుకుంటే.. మళ్లీ సమస్య అవుతుందని అనుకుంటున్నారేమో కానీ.. మంత్రి మోపిదేవి మరో రకమైన ప్రకటన చేశారు. చంద్రబాబు ఏపీకి వస్తే.. పధ్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఏపీలో క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలా మోపిదేవి ప్రకటన చేసే సమయంలో.. ఏపీ మంత్రి… ఆదిమూలం సురేష్ హైదరాబాద్‌కు వెళ్లి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఆయన హైదరబాద్ ఎలా వెళ్లగలిగారు అన్నది.. ఓ మిస్టరీ అయితే. .. తాను హైదరాబాద్ వచ్చినట్లుగా అందరికీ చెప్పుకోవడానికి మీడియాకు సమాచారం ఇవ్వడం ఏమిటో చాలా మందికి పజిల్‌గా మారింది .
చంద్రబాబు ఏపీకి వస్తే.. క్వారంటైన్ లో ఉండాలన్న వైసీపీ నేతలు.. మరి ఆదిమూలం సురేష్ ఏపీకి రాగానే క్వారంటైన్‌కి తరలిస్తారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ.. అనేక మంది విద్యార్థులు, ఏపీ వాసుల్ని .. తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. కొంత మంది పలుకుబడితో మాత్రం యధేచ్చగా సరిహద్దు దాటి వెళ్తున్నారు. వారికిమాత్రం అడ్డంకులు ఉండటం లేదు. ఇతరులకు మాత్రం రూల్స్ అడ్డం వస్తున్నాయి. చంద్రబాబు అయినా.. ఎవరైనా.. ఏపీలో ఉన్నా… హైదరాబాద్‌లో ఉన్నా.. అమెరికాలో ఉన్నా.. ఇంటికే పరిమితవ్వాలి కానీ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని. టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.