తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు స్కిల్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులను 29వ వరకూ కొనసాగిస్తూ తర్వాత వాటినీ తొలగించారు. ఇక చంద్రబాబు 29 నుంచి జనాల్లోకి వస్తారని ప్రచారం చేస్తున్నాయి టీడీపీ వర్గాలు. కానీ అసలు కేసు సుప్రీంకోర్టులో ఉందని.. 17ఏ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తేనే పూర్తి రిలీఫ్ దొరికినట్లు అని టీడీపీ వర్గాలకు క్లారిటీ ఉంది.
చంద్రబాబుపై ఉన్నది ఆ ఒక్క కేసు కాదు. మొత్తం ఆరు కేసులు ఉన్నాయి. అందులో ఒక్క కేసులోనే బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏమీ తేలడం లేదు. వరుసగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఒక వేళ అన్నింటిలోనూ ముందస్తు బెయిల్ ఇచ్చినా మరి కొన్ని కేసులు పెట్టడానికి సీఐడీ రెడీగా ఉంది. అందుకే చంద్రబాబుకు రిలీఫ్ దక్కాలంటే.. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన 17ఏ సెక్షన్ వర్తింపుపై అనుకూల తీర్పురావాలి.
చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్లో ఉంచాలని వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తలు గట్టి పట్టుదలు. నమోదు చేస్తున్న కేసుల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు 17ఏ విషయంలో నిరాశ ఎదురయితే.. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంది. అన్ని కేసుల్లో ఒకే సారి కాకుండా.. ఒక కేసు తర్వాత మరో కేసును తెర ముందుకు తెచ్చి బెయిల్ వచ్చే సమయంలో మరోసారి అరెస్టు చూపించే వ్యూహాలను అమలు చేయవచ్చు. ఆయనను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయాలన్న వ్యూహం అమలు చేసే అవకాశం ఉంది.
17ఏ వర్తింపుపై అనుకూల తీర్పు వస్తే నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయి. మళ్లీ కొత్తగా ఏదైనా కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోలాంటే.. సీఐడీ కేసు పెట్టేసినట్లుగా ఏదో ఒకటి చెప్పి కేసు పెట్టేయడం కాదు.. చంద్రబాబుకు ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు చూపించాలి. అది అసాధ్యం కాబట్టి 17ఏ సెక్షన్ వర్తింపుపై అనుకూల తీర్పురావడమే చంద్రబాబుకు కీలకమని చెబుతున్నారు.