ఎట్టకేలకు చంద్రబాబునాయుడు గ్రేటర్ ఎన్నికల పోరు బరిలోకి ప్రచారానికి రాబోతున్నారు. భాజపా తరఫున అటు వెంకయ్యనాయుడు కూడా శంఖం పూరించిన తర్వాత.. అందరూ ఊహించినట్లుగా లేదా ఆశించినట్లుగా పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల బరిలో తన ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడగా.. తెలుగుదేశానికి అంతో ఇంతో ఓట్లు రాబట్టగల కీలక నేతగా చంద్రబాబునాయుడు రెండురోజులు కేటాయించి.. పార్టీకి సానుకూల అవకాశాలు ఉన్న కేంద్రాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించడానికి పూనుకుంటున్నారు.
ఈ గ్రేటర్ ఎన్నికలు మొత్తాన్ని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కనుసన్నల్లోనే తెదేపా ఎదుర్కొంటున్నది. నిజానికి పార్టీలోని కొందరు కీలక నాయకులు ప్రచారపర్వానికి దూరం ఉంటున్న వాతావరణం కూడా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రచారానికి వస్తున్న చంద్రబాబునాయుడు ఎలాంటి ఎప్రోచ్‌తో ప్రచారంలో విరుచుకుపడతారనేది అందరికీ ఆసక్తికరంగా ఉంది.
అయితే ఇటీవలి పరిణామాలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య హఠాత్తుగా నెలకొన్న మైత్రీబంధం నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు ఇదివరకటి మాదిరిగా తెరాస పాలన మీద, కేసీఆర్ అరాచకాల మీద విరుచుకుపడడం ఈ ప్రచారంలో ఉండకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తాము భాజపాతో జతకట్టి ఉన్నప్పటికీ కూడా.. ఏకపక్షంగా విజయం సాధించి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటాం అనే నమ్మకంతో ఎంతమాత్రమూ లేదన్నది స్పష్టం. స్వయంగా ఆ పార్టీ వ్యూహకర్త నారా లోకేశే.. మేం కింగ్‌మేకర్‌గా ఉంటాం అని సెలవివ్వడమే.. వారి వెనుకంజకు నిదర్శనం. ఇలాంటి నేపథ్యంలో ఎటూ మనం ఎక్కే అవకాశం లేని అధికార పీఠం కోసం, కేసీఆర్‌తో సున్నం పెట్టుకోవడం ఎందుకు? అనే లాజికల్ వ్యూహానికి చంద్రబాబునాయుడు తలొగ్గే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
మరి చంద్రబాబునాయుడు రెండురోజుల పాటు నగరంలో నిర్వహించనున్న సుడిగాలి ప్రచారంలో కేవలం నగరాభివృద్ధి మొత్తం తాను చేసిందే అనే పాజిటివ్ మాటలకు మాత్రమే పరిమితం అవుతారో.. లేదా, కేసీఆర్ పార్టీని మట్టుపెట్టవలసిన అవసరాన్ని కూడా ప్రజలకు తెలియజెబుతారో వేచిచూడాలి.