తెలుగుదేశం పార్టీకి కేంద్రంలోని భాజపా అంటే భయమో భక్తో ప్రేమో అభిమానమో అవసరమో ఇకేందో! కేంద్రంపై చంద్రబాబుకు ఉన్న ఫీలింగ్‌ను మరింతగా ప్రదర్శించాల్సిన సమయం వచ్చేసినట్టుంది! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వేరేలా ఉంటే బాబు ఇంకోలా మాట్లాడి ఉండేవారేమో. కానీ, భాజపా ఇమేజ్, మోడీ బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతూ ఉండటంతో.. చంద్రబాబు నాయుడు కూడా తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా శాసన సభలో ఆయన మాట్లాడిన తీరే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు!
ఏపీకి కేంద్రం చేస్తున్న ప్రత్యేక సాయానికి కేబినెట్ చట్టబద్ధత కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విషయమై శాసన సభలో మాట్లాడుతూ… ఆంధ్రాకి ప్రత్యేక హోదా అవసరం లేదని, తత్సమానమైన ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం తిరస్కరించింది కాబట్టి, భవిష్యత్తు ఇతర రాష్ట్రాలకు కూడా హోదా రాదనే విషయాన్ని గమనించాలని వివరించారు. గతంలో హోదా పొందిన రాష్ట్రాలు ఇంతవరకూ సాధించింది ఏం లేదనీ, ప్రత్యేక సాయానికి కేంద్రం చట్టబద్ధత కల్పించడం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని విషయమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలపడం పోయి, విమర్శిస్తుండటం దారుణం అంటూ భాజపాని వెనకేసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ వైకాపాని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సో… చంద్రబాబు ఇంటెన్షన్ చాలా స్పష్టంగా మరోసారి అర్థమౌతోంది. కేంద్రం ఏది ఇస్తే దాంతోనే సంతృప్తి పడాలని.. తిరిగి కేంద్రాన్ని ఎదురు ప్రశ్నించొద్దని ఇతర పార్టీలకు కూడా ఆయన సందేశం ఇస్తున్నట్టుగా ఉన్నారు. నిజానికి, ప్రత్యేక హోదా రద్దు చేసినట్టుగానీ, చేయాలనిగానీ, 14వ ఆర్థిక సంఘానికి సిఫార్సులు చేయలేదని ఆ సంఘానికి చెందిన కొంత సభ్యులే చెప్పారంటూ జగన్ అంటున్నారు. మరి, ఆ విషయమై చంద్రబాబు మాట్లాడటం లేదు. అంతేకాదు… ఇలాంటి ప్రశ్నలు వేయొద్దని ప్రతిపక్షానికి కూడా ఆయన సూచిస్తుండటం గమనించాలి.
కేంద్రం దగ్గర మరింతగా లొంగి ఉండాల్సిన అవసరం వ్యక్తిగతంగా చంద్రబాబుకు అనివార్యం కావొచ్చు. కానీ, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నట్టు గతంలోనూ విమర్శలొచ్చాయి… ఇప్పుడూ అదే జరగబోతోంది. అయితే, ఇన్నాళ్లూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే భాజపా పెద్దల అడుగులకు మడుగులొత్తేవారు.. ఇప్పుడు పార్టీని పరిరక్షించుకోవడం కోసం కూడా ఈ పని ఇంకాస్త ఎక్కువ స్థాయిలో చేయాల్సిన అవసరం ఏర్పడ్డట్టుంది..! ఎందుకంటే, భాజపా రాష్ట్రాల వారీగా టార్గెట్లు పెట్టుకుని మరీ అధికారం చేజిక్కించుకుంటోంది. ఏపీలో కూడా భాజపా సొంతంగా ఎదిగితే… దెబ్బపడేది తెలుగుదేశానికే! అందుకే, ఆ అవకాశం భాజపాకి ఇవ్వకుండా ఉండాలంటే… వీలైనంత స్నేహాన్ని పెంచుకుంటూ ఉండాలి. కేంద్రం ఏం చెబితే అది అద్భుతః అంటూ మోసెయ్యాలి..! ఇకపై చంద్రబాబు ధోరణిలో ఇలాంటి మార్పులే మనం చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.