ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణలో కేసీఆర్ ఎంతగా అవమానించాడో అందరికీ తెలుసు. రాజకీయవైరం కాకుండా జగన్ తో ఉన్న దోస్తీతో… హైదరాబాద్ లో ఉన్నా చంద్రబాబుకు సంబంధించిన సమావేశాలకు అనుమతులు ఉండేవి కాదు. బాబు అరెస్ట్ సమయంలోనూ నిరసనలకు అనుమతి లేదని ఆనాటి కేసీఆర్ సర్కార్ అణచివేసిన ఘటనలు కూడా తెలిసిందే.
కానీ, పరిస్థితులు మారాయి. ఎక్కడైతే అవమానించబడ్డామో… అక్కడే తలెత్తుకొని నిలబడాలన్నట్లు చంద్రబాబు ఇదే హైదరాబాద్ లో భారీ ర్యాలీతో స్వాగతం చెప్పబోతున్నాయి టీడీపీ శ్రేణులు.
అవును… ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని భావిస్తున్న టీడీపీ… బేగంపేట నుండి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీకి అనుమతి కోరింది. దీంతో షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.
సాయంత్రం ఆరు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ర్యాలీ మొదలవుతుంది. ప్రజా భవన్ మీదుగా భారీ ర్యాలీ కొనసాగబోతుంది. సాయంత్రం 6గంటల నుండి రాత్రి 8గంటల వరకు ర్యాలీ జరగబోతుండగా… భారీ స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి.
ర్యాలీ జరుగుతున్న సమయంలోనే అధికారంలోకి వచ్చాక తొలిసారి చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించనున్నారు. 50కార్లు, 150బైకులతో ర్యాలీకి అనుమతి ఉండగా… అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.