కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు దేశంలోనే ఓ ప్రత్యేక నియోజకవర్గంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కుప్పం ప్రజలకు అందుబాటులో ఉన్న వనరులతో వారి ఆర్థిక స్థితిగతుల్ని మార్చడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు కుప్పం ప్రజలు ఆర్థికంగా బలవంతులు. కుప్పం నియోజకవర్గాన్ని కూడా దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు అంశాలపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఒకటి వంద శాతం ప్రకృతి వ్యవసాయం, రెండువంద శాతం సోలార్ పవర్ నియోజకవర్గం.
సోలార్ పవర్ ప్రతి ఇంటిపై ఉండేలా చూసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వంద శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కొన్ని ఇళ్లకు అమర్చారు. వారికి కలుగుతున్న ప్రయోజనాలను పరిశీలిస్తున్నారు. సంతృప్తికరంగా ఉంటేమొత్తం విస్తరించనున్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం కుప్పం నియోజకవర్గం పవర్.. సోలారు ఆధారంగా ఉండేలా చేయనున్నారు. అప్పుడు అందరికీ విద్యుత్ బిల్లుల ఖర్చు ఉండదు. అంతే కాదు మిగులు విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానిస్తే ఎంతో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అలాగే కుప్పం నియోజకవర్గానికి వ్యవసాయ పరంగా ఎంతో పేరు ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్గానిక్ వైపు మారుతోంది. ఈ క్రమంలో కుప్పంలోని రైతులు అందర్నీ ఆర్గానిక్ వైపు మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారు. అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రకృతి వ్యవసాయం రాత్రికి రాత్రి అయ్యేది కాదు కాబట్టి పదేళ్లు టార్గెట్ పెట్టుకున్నారు. పదేళ్లలో కుప్పం మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసే నియోజకవర్గంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.