ఏపీలో మళ్లీ భూతం వస్తే ఎలా అని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఆ భూతాన్ని మూడు నెలల్లో భూస్థాపితం చేస్తాం.. ఎవరూ భయపడవద్దని.. ఆ భయం లేదని భరోసా ఇస్తున్నాను అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు చెప్పారు. అమరావతిలో మీడియా సమావేశాల్లో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. చంద్రబాబు చెప్పే ఆ భూతం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు నెలల్లో భూస్థాపితం చేస్తామని చెబుతున్నారు. అంటే చంద్రబాబు ఏదో ప్లాన్ లో ఉన్నారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
ఏపీ వైపు పెట్టుబడిదారులు రావాలంటే.. గత ఐదేళ్లలో తమకు ఎదరైన సమస్యలు మరోసారి రావని భరోసా ఇవ్వాలి. అలాంటి భరోసా కేవలం భూతం మరోసారి పవర్ లోకి రాదని నమ్మకం కలిగించడం వల్లనే వస్తుంది. గతంలో కూటమిగా ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందని మీడియా ప్రశ్నించినప్పుడు లోకేష్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. వంద సీట్లతో గెలవడానికి పొత్తులు అవసరం లేదని కానీ వైసీపీని తుడిచి పెట్టేయాలంటే పొత్తులు చాలా అవసరమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం గెలవడం మాత్రమే కాదని.. మళ్లీ పెట్టుబడిదారులు ఏపీ వైపు రావాలంటే… వారికి ధైర్యం ఇవ్వాలంటే ఏకపక్ష విజయం సాధించడం చాలా అవసరం అని చెప్పారు. ఫలితం అలాగే సాధించారు.
ఇప్పుడు పెట్టుబడిదారులు ఏపీకి రావాలన్నా .. కాంట్రాక్టర్లు పనులు చేయాలన్నా వారికి భూతం మళ్లీ రాదన్న భరోసా ఇవ్వాలి. అందుకే చంద్రబాబు ఓ ప్రత్యేకమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రణాళిక ఏమిటన్నది స్పష్టత లేదు కానీ.. మూడు నెలల్లో ఆ భూతానికి చావుదెబ్బ తగలబోతోందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ పరంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. ఇప్పటికే ప్లాన్ రెడీ చేసి ఉంటారు కాబట్టే మూడు నెలల్లో భూతం భూస్థాపితం అని చెబుతున్నారని అంచనా వేస్తున్నారు.