ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి వ్రాసిన ఒక లేఖ సంచలనం కలిగిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం తీసుకొంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటాలు చేస్తున్నారు కనుక ఆయనకి ప్రాణహాని ఉందని, కనుక ఆయనకి అధనపు భద్రత కల్పించవలసిందిగా తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరుతూ చంద్రబాబు కేంద్ర హోం మంత్రికి లేఖ వ్రాశారు.
ఆయన ఆవిధంగా లేఖ వ్రాయడం అంటే తెలంగాణా ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నట్లే భావించవచ్చు. తెలంగాణా ప్రభుత్వం వలన రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని లేఖలో వ్రాయకపోయినా దానర్ధం మాత్రం అదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణా ప్రభుత్వంపై అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్రానికి ఈవిధంగా లేఖ వ్రాయడంపై తెలంగాణా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తధ్యం. రేవంత్ రెడ్డికి అధనపు భద్రత కావాలనుకొంటే నేరుగా ఆయనే ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే గవర్నర్ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆయన ఆ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు రాలేదు. ముందు ఆయన ప్రయత్నం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి లేఖ వ్రాయడం అంటే రాజకీయం చేస్తున్నట్లుగానే చూడవలసి ఉంటుంది. దీనిపై తెరాస ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.