ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లను కలుస్తారు. శనివారం రోజు మహారాష్ట్రలో ప్రచారం చేయనుననారు. ఎన్డీఏ ముఖ్యనేతలందరితో అక్కడ బీజేపీ కూటమి నేతలు ర్యాలీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. అదే సమయంలో ముంబై దేశ ఆర్థిక రాజధాని కావడంతో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి జనం వచ్చి నివసిస్తూంటారు. అందుకే ఇతర రాష్ట్రాల నేతలూ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు సేవల్ని కూడా వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకుది.
మహారాష్ట్ర అసెంబ్లీలో గెలవడం.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి అత్యంత ముఖ్యం. జాతీయ రాజకీయాల్లోనూ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు కారణం అవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని కూటమి నిర్ణయించుకుంది. ఇరవయ్యో తేదీన మహారాష్ట్రలో ఒకే విడత ఎన్నికలు జరగనున్నాయి.